Ganja Racket Dairy Farm | డెయిరీ ఫామ్​లో గంజాయి దందా

డెయిరీ ఫామ్​ కేంద్రంగా గంజాయి దందా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganja Racket Dairy Farm | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ఈగల్​ ఫోర్స్ (Eagle Force)​, పోలీసులు దాడులు జరుపుతున్నా.. గంజాయి విక్రయాలు మాత్రం ఆగడం లేదు. విక్రేతలు చిక్కుతున్నా.. గంజాయి దందాలో సూత్రధారులు పోలీసులకు దొరకడం లేదు. దీంతో దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు డెయిర్​ ఫామ్​లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్​ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూరు గ్రామంలోని ఒక డెయిరీ ఫామ్ కేంద్రంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. నిత్యం అక్కడకు పదుల సంఖ్యలో వినియోగదారులు గంజాయి కోసం వచ్చేవారు. ఆదివారాల్లో అయితే 50 మంది వరకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు శనివారం డెయిరీ ఫామ్​పై దాడి చేసి, నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు.

Ganja Racket Dairy Farm | వలస కార్మికులకు..

బీహార్​కు చెందిన సంచిత్​ రాయ్​ డెయిరీ ఫామ్​లో పని చేసేవాడు. గతంలో అతడికి గంజాయి అలవాటు ఉంది. ఫామ్‌కు ఎదురుగా ఉన్న దేవి పార్కింగ్ యార్డ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేష్ కుమార్​తో కలిసి అతడు గంజాయి దందా ప్రారంభించాడు. దూల్​పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేవాడు. ముఖ్యంగా బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస కార్మికులకు గంజాయి అమ్మేవారు. డెయిరీ ఫామ్​ యజమాని ఉదయం మాత్రమే అక్కడకు వచ్చేవాడు.

Ganja Racket Dairy Farm | ఫోన్​లో ఆర్డర్లు..

దీంతో అతడికి తెలియకుండా ఫామ్​ను గంజాయి రవాణా కేంద్రంగా మార్చుకున్నారు. పక్కా సమాచారంతో ఈగల్​ ఫోర్స్​ దాడి చేసి నిందితులు రాయ్​, మహేశ్​కుమార్​లను అరెస్ట్​ చేసింది. సుమారు రూ. 57 వేల విలువైన 1.15 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వినియోగదారులు గంజాయి కోసం రాయ్​కు ఫోన్​ చేసేవారు. అతడు ఫామ్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో వారికి గంజాయి ఇచ్చి డబ్బులు తీసుకునే వాడు. ఈ కేసులో వారికి గంజాయి సరఫరా చేసే ధూల్‌పేట్‌కు చెందిన కిషన్ సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : BJP Padayatra | రేపు బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *