అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Farmers Demand | సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే ఎగ్గొట్టిన మూడు రైతుబంధులతో పాటు యాసంగి రైతుబంధు కలిసి ఎకరానికి రూ.60 వేలు జమ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు విడతల రైతుబంధు డబ్బులు వేయాలన్నారు.
ఆదిలాబాద్లో నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరిట అన్నదాతలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తర్వాత వారిని మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని రైతు కూలీలకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 36 నెలలు అవుతోందని రూ.36 వేలు వారి ఖాతాల్లో వేయాలన్నారు.
KTR Farmers Demand | తుమ్మిడిహట్టి పేరిట డ్రామాలు
కాళేశ్వరం వద్ద ఈరోజు కూడా 20 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఆ నీటిని ఎత్తిపోయొచ్చని చెప్పారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, పంట కొనాలి, పంట బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇవన్నీ ఎగ్గొట్టడానికి కరెంట్ లేదు, నీళ్లు లేవని సీఎం రేవంత్రెడ్డి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేని సీఎం.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతారట అని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్ట్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్నారు.
KTR Farmers Demand | కరువు వస్తుందని చెప్పినా..
కరువు రాబోతోందని జూన్ నెల నుంచే బీఆర్ఎస్ హెచ్చరించిందని కేటీఆర్ గుర్తుచేశారు. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతున్నాయని, ఎత్తిపోయాలని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమపై రాజకీయ కక్షతో పంపులను ఆన్ చేయకుండా.. 750 టీఎంసీల గోదావరి జలాలను దిగువకు వదిలేసి
రాష్ట్రంలో కరువుకు కాంగ్రెస్ కారణమైందని మండిపడ్డారు. రైతుల బాధలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వట్లేదు, నీళ్లు లేవంటున్నారు, రైతు బంధుతో పాటు రైతు బీమాను ఎగ్గొట్టారన్నారు.
KTR Farmers Demand | కాంగ్రెస్ తెచ్చిన కరువు!
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సరిగ్గా ఉపయోగించుకుంటే తెలంగాణలో అసలు కరువే ఉండదన్నారు. కృష్ణా నదికి 730 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు తీసుకు పోయారని, సీఎం రేవంత్రెడ్డి మాత్రం పక్కనే ఉన్న పాలమూరుకు నీళ్లు ఎత్తిపోయలేకపోయారని విమర్శించారు.
దీనిని కూడా చదవండి : Drunk Ambulance Driver | డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ అంబులెన్స్ డ్రైవర్