అక్షరటుడే, వెబ్డెస్క్: Yadadri Power Station | ఎల్నినో నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ బి సురేష్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ మేరకు ఉత్పత్తి చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)సైతం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) దామరచర్లలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ బి. సురేష్ను టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్ సస్పెండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణల రావడంతో చర్యలు తీసుకున్నారు.
Yadadri Power Station | ఇన్ఛార్జుల నియమాకం
యాదాద్రి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఐఏఎస్ అధికారులు చెవ్వూరి హరికిరణ్, వెంకటేశ్ దోత్రే, రాహుల్ రాజ్, హనుమంత్ కొండిబ, శివకుమార్ నాయుడును ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ నెల 15 నుంచి 30 వరకు రోజుకు ఒక్కరు (కేటాయించిన తేదీల్లో) ప్లాంట్ను సందర్శించాలి. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Telangana Weather Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ