Gurukula Funds Release | ‘భవన అద్దె’ ‘డైట్’, ‘కాస్మెటిక్స్’ నిధుల విడుదల.. ఇకపై నెలవారీ చెల్లింపులు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gurukula Funds Release | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహ పాఠశాలల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది.

షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని నివాస విద్యాసంస్థలకు సంబంధించిన కాస్మెటిక్స్ ఖర్చులు, ఆహార వ్యయాలు (డైట్ ఛార్జీలు), భవన అద్దెలను ఇకపై ప్రతి నెల సకాలంలో విడుదల చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.

Gurukula Funds Release | నెలవారీ చెల్లింపుల విధానం:

గతంలో ఈ నిధుల చెల్లింపుల్లో 8 నుంచి 9 నెలల వరకు ఆలస్యం కావడం వల్ల నివాస పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

ఇందులో భాగంగా మొదట త్రైమాసిక (మూడు నెలలకోసారి) చెల్లింపుల విధానాన్ని తీసుకువచ్చి, ప్రస్తుతం దాన్ని నెలవారీ చెల్లింపుల విధానంగా మార్చారు. 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కీలక మార్పును ప్రకటించడం గమనార్హం.

ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు నిరంతరాయంగా పోషకాహారం అందడంతో పాటు హాస్టళ్ల సక్రమ నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు సాఫీగా సాగనున్నాయి. ఇది విద్యార్థుల విద్యా ఫలితాలను, పాఠశాలల వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది.

Gurukula Funds Release | రూ. 221.24 కోట్ల నిధులు విడుదల:

నెలవారీ చెల్లింపుల నిర్ణయంలో భాగంగా.. వివిధ సంక్షేమ, విద్యా శాఖల పరిధిలోని వసతి గృహ విద్యాసంస్థల ఆహార, కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెల కోసం ప్రభుత్వం రూ.221.24 కోట్లను విడుదల చేసింది.

ఈ నిధుల విడుదల ద్వారా వసతి గృహ పాఠశాలల్లోని విద్యార్ధుల పోషణ, సంక్షేమం, వసతి సదుపాయాలకు పూర్తి స్థాయిలో నిరంతర మద్దతు లభించనుంది.

“అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన నివాస సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సాధికారత సాధించడమే కాకుండా, వారిని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *