అక్షరటుడే వెబ్‌డెస్క్: Hindu Temple Attack Plot | అమెరికాలో ( USA ) హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా చికాగో సమీపంలోని ఓ హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పలాటైన్కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ను ఈ ఘటనకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒహియోలోని రిచ్మండ్ హైట్స్‌లో శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ మందిరాన్ని ధ్వంసం చేసిన ఘటన జరిగిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ తాజా ఉదంతం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సమయంలో ఈ కుట్ర బయటపడటం గమనార్హం.
Hindu Temple Attack Plot | సహోద్యోగి సమయస్ఫూర్తితో ..
పలాటైన్లోని ‘టాకో బెల్’ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్న పాపోరాకిస్, హిందూ ప్రార్థనా మందిరంపై సామూహిక కాల్పులకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు దాడికి సంబంధించిన ప్రణాళికా పత్రం, రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్ , ఇతర వ్యూహాత్మక పరికరాల ఫోటోలను తనతో పనిచేసే సహోద్యోగికి పంపాడు. ఆదివారం నాడు ఓ ‘ప్రత్యేకమైన రోజు’ జరగబోతోందని చెప్పిన నిందితుడు, అదే రోజు తన సహోద్యోగికి ఫోన్ చేసి తన తుపాకీ జామ్ అయిందని, అందుకే ఎవరికీ కనిపించకుండా చాలా వేగంగా అక్కడి నుంచి వచ్చేశానని తెలిపాడు. ఈ పరిణామాలపై అనుమానం వచ్చిన సదరు ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో భారీ ముప్పు తృటిలో తప్పింది.
Hindu Temple Attack Plot | భారీగా ఆయుధాలు..
సమాచారం అందుకున్న పలాటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసు విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. అక్టోబర్ 11 సాయంత్రం నిందితుడు తన నివాసం నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా ఒక రైఫిల్, బుల్లెట్లతో నింపిన పలు రైఫిల్ మ్యాగజైన్లు, వందలాది అదనపు తూటాలు, వ్యూహాత్మక పరికరాలు లభించాయి. అలాగే శ్వేతజాతి ఆధిపత్య తీవ్రవాద గుర్తులు ఉన్న ప్యాచ్‌తో కూడిన బాడీ ఆర్మర్ వెస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ‘వై ఐ ఫౌట్: ఎ.కె.ఏ. (అరోరా షూటర్స్ మేనిఫెస్టో)’ పేరుతో ఉన్న ఒక పత్రాన్ని పోలీసులు పరిశీలించారు. అందులో శ్వేతజాతి ఆధిపత్య భావజాలంతో పాటు దక్షిణాసియా ప్రజలు, ప్రత్యేకించి భారతీయ సంతతికి చెందిన వారిపై హింసను ప్రేరేపించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు , చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు కేసులు నమోదు చేశారు.
Hindu Temple Attack Plot | దేవాలయాలకు భద్రత పెంపు..
ఇల్లినాయిస్లోని అరోరా ప్రాంతంలో ఉన్న హిందూ ప్రార్థనా మందిరమే లక్ష్యంగా ఈ దాడికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అరోరా పోలీసులతో పాటు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. పలాటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు తమ పరిధిలోని అన్ని హిందూ దేవాలయాలను సంప్రదించి, భద్రతాపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసిన పలాటైన్ పోలీస్ చీఫ్ విలియం నార్డ్.. ఇలాంటి బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోబోమని, ప్రార్థనా స్థలాల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. కాగా, పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయడాన్ని ‘హిందూ అమెరికన్ ఫౌండేషన్’ ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రతి ఒక్కరికీ భయం లేకుండా ప్రార్థన చేసుకునే హక్కు ఉందని పేర్కొంటూ, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపిచినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది.
ఇది కూడా చదవండి: Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో