Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మెట్రో ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వెల్లడించిన కీలక విషయాలు ఇవే.

Hyderabad Metro Phase 2 | మెట్రో టేకోవర్ వెనుక అసలు కథ..

మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కావాలంటే, మొదటి దశను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ ప్రతినిధులు మెట్రోను నడపడం వల్ల ఏటా రూ.400 కోట్ల నష్టాలు వస్తున్నాయని, తాము ఇక ఈ ప్రాజెక్టులో కొనసాగలేమని తేల్చి చెప్పారని ఆయన వివరించారు. ఎల్ అండ్ టీని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో, ఆస్తులను కొనుగోలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్ పర్యవేక్షణలో, రూ.30 వేల కోట్ల విలువైన ఎల్ అండ్ టీ ఆస్తులను రూ.15 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.

Hyderabad Metro Phase 2 | నిధుల విడుదలలో కిషన్ రెడ్డి అడ్డు..

మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి 4 శాతం వడ్డీకే రుణం పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, రూ.84 కోట్ల పేపర్ ఫీజుతో పాటు రూ.1400 కోట్ల ఈక్విటీని కూడా చెల్లించామని సీఎం చెప్పారు. అయితే, రుణం మంజూరయ్యే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. మే 30 నాటికి రావాల్సిన రూ.13,600 కోట్ల నిధులను కిషన్ రెడ్డి కారణంగానే ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు.

Hyderabad Metro Phase 2 | కేటీఆర్, కిషన్ రెడ్డిల కుట్ర..

గత నెల 21న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి, ప్రాజెక్టుకు అప్పు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరారని సీఎం ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన చెప్పినట్లుగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని, జపాన్ నుంచి రావాల్సిన నిధులను కూడా కేంద్రం విడుదల చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Hyderabad Metro Phase 2 |బాధ్యతాయుతంగా వ్యవహరించాలని..

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మెట్రో పనుల్లో జాప్యం జరిగి, అంచనా వ్యయం రూ.7 వేల కోట్లకు పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోయినా కనీసం ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.40 వేల కోట్లతో మెట్రో విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. కనీసం NOC ఇప్పించండి, శాలువా కప్పి సన్మానిస్తాం” అని సీఎం సవాల్ విసిరారు. ఇప్పటికైనా హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కిషన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Modi on US Iran Peace Deal | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *