అక్షరటుడే, వెబ్డెస్క్: HYDRAA | హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇళ్లు కూలగొట్టే అధికారం లేదన్నారు.
HYDRAA | హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని
ఈటల రాజేందర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి వేధిస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారన్నారు. తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.
HYDRAA | కాంగ్రెస్ మళ్లీ రాదు
రాష్ట్రంలో రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఈటల అన్నారు. ఫీజు రీయింబర్స్ డబ్బులు ఇవ్వడం లేదని, రైతు భరోసా సైతం పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు లేవన్నారు. మహిళకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డా కూడా రేవంత్ రెడ్డి హైడ్రా మీద, రంగనాథ్ మీద ప్రేమ చూపిస్తున్నారన్నారు. తప్పు రంగనాథ్ డి కాదు రేవంత్ రెడ్డిదని తెలిపారు. చివరికి హైడ్రా రేవంత్ రెడ్డి మాట కూడా వింటుందొ లేదో అని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Rain | హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్