HYDRAA Land Operation | కబ్జాదారులకు షాక్.. రూ. 30,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HYDRAA Land Operation | అక్రమ కబ్జాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) మరో భారీ ఆపరేషన్‌తో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు రూ. 30,000 కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడింది. స్వాధీనం చేసుకున్న భారీ ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది తక్షణమే రక్షణ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.

hydra.1

HYDRAA Land Operation | కొన్ని దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం..

పుప్పాలగూడ పరిధిలోని ఈ ప్రభుత్వ భూముల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన చారిత్రక రాతి గుట్టలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని హెచ్‌ఎండీఏ (HMDA)కు కేటాయించింది. అయితే, ఈ చారిత్రక సంపదను కాపాడాలంటూ ‘సొసైటీ టు సేవ్‌ రాక్స్‌’ ప్రతినిధులు గత కొన్ని దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. గతంలో వీరు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ, సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో అధికారులు జాప్యం చేయడంతో ఈ విలువైన భూములు కబ్జాకు గురవుతూ వచ్చాయి.
hydra.2

 

HYDRAA Land Operation | ప్రజావాణి ఫిర్యాదుతో కదిలిన హైడ్రా..

ఈ భూకబ్జాల వ్యవహారంపై ‘సొసైటీ టు సేవ్‌ రాక్స్‌’ ప్రతినిధులు ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజున రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా బలగాలు పుప్పాలగూడలో భారీ ఆపరేషన్ చేపట్టాయి. వివాదాస్పద ప్రభుత్వ భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ వేసి, కబ్జాదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు హైడ్రా ఒక్క దెబ్బతో పరిష్కారం చూపడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: SI Extramarital Affair | హోంగార్డు భార్యతో ఎస్సై వివాహేతర సంబంధం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *