అక్షరటుడే, ఇందూరు: Interlink Power Supply | వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్‌లింక్ విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Interlink Power Supply | సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే..
ఏదైనా ఒక సబ్‌స్టేషన్ (Substation)లో, ప్రధాన లైన్లలో ప్రకృతి వైపరీత్యాలు, గాలివానలు, వరదలు, అత్యవసర మరమ్మతులు కారణంగా సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఆ సమయంలో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆధునిక ఇంటర్ లింక్‌లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Interlink Power Supply | ఇంటర్ లింక్ వ్యవస్థ ఏమిటంటే..
సాధారణంగా ఒక విద్యుత్ లైన్లలో లోపం ఏర్పడితే ఆ పరిధిలోని వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తారన్నారు. అలాగే ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు సమీపంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు, అలాగే ఒక 33 కేవీ లైన్‌ను మరో 33 కేవీ లైన్‌కు అనుసంధానం చేస్తారన్నారు. దీంతో ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. దీంతో వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.

Interlink Power Supply | సర్కిల్లో సాధించిన పురోగతి..
సర్కిల్ పరిధిలో ఉన్న 70 33/11 కేవీ సబ్ స్టేషన్లలో ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశామని సూపరింటెండింగ్ ఇంజినీర్ తెలిపారు. ఈ వ్యవస్థ అమలుతో గోవిందపెట్ నుండి జానకంపేట, కమలాపూర్ నుండి జన్నెపల్లి, దండిగుట్ట నుండి నీలా, రాంపూర్ నుండి పాల్దా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలు తగ్గాయని వివరించారు. అదేవిధంగా మరో 33 కేవీ లైన్ల మధ్య కూడా ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, దీంతో విద్యుత్ సరఫరాలో మరింత స్థిరత్వం సాధించగలిగామని పేర్కొన్నారు.
Interlink Power Supply | మిగిలిన ప్రాంతాల్లోనూ..
మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థను విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నామని ఎస్ఈ వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Congress Booth Training | 10న కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లకు శిక్షణ
