అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Interstate Theft Gang | పగటిపూట ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నిజామాబాద్(Nizamabad) పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.
Interstate Theft Gang | పక్కా సమాచారంతో..
నవీపేట్ మండల కేంద్రంలో అక్టోబర్ 4న మధ్యాహ్నం వేళ ఓ ఇంట్లో జరిగిన చోరీపై నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా, నిందితులు నిజామాబాద్ వైపు వస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో నవీపేట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నవీపేట్తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మొత్తం 11 కేసుల్లో నేరాన్ని అంగీకరించారు. అలాగే కర్ణాటకలోని యాద్గిర్ ప్రాంతంలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.
Interstate Theft Gang | దర్జాగా కారులో వచ్చి..
ప్రధాన నిందితుడు సయ్యద్ షకీల్ కారుకు నకిలీ నంబర్ ప్లేట్ అమర్చుకుని వస్తాడు. తాళం వేసిన ఇళ్లలోకి వెళ్లి చోరీకి పాల్పడేవాడు. మిగిలిన ఇద్దరు నిందితులు బయట కాపలా ఉంటూ చుట్టుపక్కల పరిస్థితులను గమనించేవారు. నిందితుల నుంచి 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 29 తులాల వెండి వస్తువులు, రూ.5వేల నగదు, హోండా సిటీ కారు, స్వాధీనం చేసుకున్నారు. నవీపేట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు. సహాయ పోలీస్ కమిషనర్ బి. ప్రకాష్ యాదవ్, నార్త్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాస్, సహాయ పోలీస్ కమిషనర్ శ్రీశైలం, ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్, ఇతర సిబ్బంది ప్రతిభను పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య అభినందించారు.
ఇది కూడా చదవండి: నీలోఫర్‌లో ఒకే బెడ్‌పై ముగ్గురు పేషెంట్లు..