అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: SC ST Atrocities Cases | ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
SC ST Atrocities Cases | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో..
ముందుగా జిల్లాలో ఇటీవల నియామకమైన నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్, మత్స్య, పరిశ్రమల శాఖ ఆద్వర్యంలో జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై ఇన్ఛార్జి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న వివరించారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తే బాధితులకు న్యాయంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాలో అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
SC ST Atrocities Cases | ఎస్సీ, ఎస్టీ పథకాల ప్రయోజనాలు..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పథకాల ప్రయోజనాలు అందిపుచ్చుకునేలా, అలాగే వారి సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద ఇప్పటి వరకు రూ.1, 81,57,500 పరిహారం అందించామని వెల్లడించారు. ప్రతినెలా చివరి రోజున అన్ని మండలాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాలు, ఉపకార వేతనం, విదేశీ విద్యా, వివిధ ప్రభుత్వ సబ్సిడీ, ఉపాధి కల్పన పథకాలలపై సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.
ఎస్పీ మహేష్ గితె మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.నరేష్ నాయక్, బీపేట రాజు, భూక్య రమేష్, బడుగు లింగయ్య, జోగు రవీందర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తోట లహరి, వీర రమణయ్య, చింతోజు భాస్కర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Pallagutta Protection | పల్లగుట్టను కొల్లగొడితే ఊరుకునేది లేదు..: చాడ వెంకట్రెడ్డి