IPL 2026 Playoff Race | రసవత్తరంగా మారిన ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు.. ప్లే ఆఫ్స్ కోసం ఎవరికెన్ని విజయాలు అవసరం?

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2026 Playoff Race | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 (Indian Premier League 2026) సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. దాదాపు అన్ని జట్లు తమ తొలి 7-8 మ్యాచ్‌లను పూర్తి చేయడంతో లీగ్ దశ ముగింపు వైపు సాగుతోంది. దీంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఈసారి అనూహ్యంగా కొన్ని జట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తుండగా, ఫేవరెట్ జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి దూసుకుపోతోంది. మిగిలిన 7 మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశముంది.

IPL 2026 Playoff Race | వాటికి క‌ఠిన పరీక్ష‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో బలంగా ఉంది. మిగిలిన మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ చేరడం సులభమే. ఇక రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు చెరో 10 పాయింట్లతో నిలిచాయి. ఈ రెండు జట్లు మిగిలిన 6 మ్యాచ్‌లలో మూడు గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయం చేసుకుంటాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల పరిస్థితి కొంత క్లిష్టంగా మారింది. ఇక గుజరాత్ 8 పాయింట్లతో ఉండగా, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం నాలుగింటిలో గెలవాలి. చెన్నై 6 పాయింట్లతో ఉండటంతో, మిగిలిన మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ కూడా 3 విజయాలతో వెనుకబడి, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో ఐదింటిలో గెలవడం తప్పనిసరి.

 IPL 2026 Playoff Race | మ్యాచ్ గెలవడం తప్ప మరో మార్గం లేదు

కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్లు ప్లేఆఫ్స్ రేసులో దాదాపు వెనుకబడ్డాయి. కేకేఆర్ 5 పాయింట్లతో ఉండగా, మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితి. ముంబై, లక్నో జట్లు చెరో 4 పాయింట్లతో అట్టడుగున ఉండటంతో, ఇకపై ప్రతి మ్యాచ్ గెలవడం తప్ప మరో మార్గం లేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్లేఆఫ్స్ చేరేందుకు 16 పాయింట్లు సేఫ్ జోన్‌గా భావిస్తారు. ఈ లెక్కన చూస్తే, టాప్ జట్లు దాదాపు లక్ష్యానికి చేరువలో ఉండగా, మిగతా జట్లు గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

మొత్తంగా ఐపీఎల్ 2026 రెండో భాగం మరింత ఉత్కంఠగా సాగనుంది. ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను మార్చే అవకాశముండటంతో, చివరి వరకు పోటీ హోరాహోరీగా కొనసాగడం ఖాయం. అభిమానులు కూడా ఈ సీజన్ క్లైమాక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Delhi powerplay record | ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్న ఢిల్లీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్ ప్లే స్కోర్లు ఇవే..!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *