అక్షరటుడే, కామారెడ్డి: Kalyana Lakshmi Forgery Case | పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అక్రమార్కులకు వరంగా మారాయి. గెజిటెడ్ సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఓ ముఠా లబ్ధిదారుల నుంచి అందినంత దోచుకుంది. ఈ ముఠా గట్టురట్టు చేసిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు. అయితే ఈ సంతకాల ఫోర్జరీ, నకిలీ స్టాంపుల కేసులో విచారణ ముందుకు సాగుతుందా.. లేదా అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.
Kalyana Lakshmi Forgery Case | భిక్కనూరు మండలంలో..
భిక్కనూర్ మండలం (Bikhnoor Mandal)లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై గెజిటెడ్ హోదా ఉన్న జీజీహెచ్ ఆర్ఎంవో సంతకం ఫోర్జరీ, నకిలీ స్టాంపులు వేసిన ఘటనపై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. విచారణలో అరకొరగా సమాచారం రావడంతో మరోసారి నిందితులను కస్టడీకి కోరి విచారణ చేపట్టనున్నారు. అయితే అన్ని తామై వ్యవహరిస్తున్న ప్రధాన నిందితుడి గుట్టు పోలీసులు వెలికి తీస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన నిందితునిగా ప్రకటించిన పోలీసులు అతడిని ఏ–3 గా చూపడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
Kalyana Lakshmi Forgery Case | స్టాంపులు తయారు చేసిందెవరో తేలేనా?
ఈ దందాకు సూత్రధారిగా చెబుతున్నది బోయిని ప్రసాద్. జీజీహెచ్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అతడికి భిక్కనూర్ మండల కేంద్రంలో జిరాక్స్ షాప్, ఇంటర్నెట్ సెంటర్ ఉంది. అక్కడే నకిలీ దరఖాస్తులు, సర్టిఫికెట్లు తయారు చేసి ఈ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ స్టాంపులను ఎక్కడ చేయించాడు, ఎంతమందికి సప్లయ్ చేశాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో జిల్లా కేంద్రంలో నకిలీ స్టాంపులు తయారు చేస్తున్న విషయం కలకలం రేపగా మరోసారి నకిలీ స్టాంపుల అంశం తెరపైకి రావడంతో ఎవరి పేర్లు బయటపడతాయనేది తెలియాల్సి ఉంది.
Kalyana Lakshmi Forgery Case | సూత్రధారులు.. పాత్రదారుల పని పడతారా..?
లబ్ధిదారులను గుర్తించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే పనిని తండ్రి కొడుకులు రాజా నరేందర్, రాజలింగంలు చూశారని పోలీసులు గుర్తించారు. బాధితులు అధికారుల చుట్టూ తిరగకుండా అంతా మేము చూసుకుంటాం అంటూ వసూళ్లకు తెరలేపింది వీరేనని తెలుస్తోంది. అయితే ఇందులో వీరి పాత్ర ఎంతవరకు ఉందనేది తెలియాల్సి ఉంది. సూత్రధారిగా చెబుతున్న బోయిని ప్రసాద్ ను కేసులో ఏ3 గా చూపారు. అతనికి సహకరించినట్లు చెబుతున్న రాజా నరేందర్, రాజలింగంలను ఏ1, ఏ2 లుగా చేర్చారు. లబ్ధిదారులను పట్టి డబ్బు వసూలు చేసే వారిని ముందుంచి, మొత్తం దందాను నడిపినట్లు ఆరోపణలు ఉన్న ప్రసాద్ ను మూడో నిందితుడిగా చూపడం వెనుక మతలబు ఏమిటి అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. అసలు సూత్రధారిని కాపాడేందుకు ఇది కుట్రా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Kalyana Lakshmi Forgery Case | 52 దరఖాస్తులు.. డబ్బు రికవరీ చేస్తారా..?
ఒక్క భిక్కనూర్ మండలంలోనే 52 మంది లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో 34 మందికి ఇప్పటికే ప్రభుత్వ సాయం అందగా, మిగతా 18 మంది దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. అయితే ప్రభుత్వ సాయం పొందిన లబ్ధిదారుల దరఖాస్తులపై కూడా గెజిటెడ్ సంతకాలు ఫోర్జరీ అని తేలితే పరిస్థితి ఏమిటి అన్న చర్చ మొదలైంది. వాటిలో నకిలీ లబ్ధిదారులు ఉన్నారా, ఉంటే వారిపై చర్యలు తీసుకుంటారా, ఇచ్చిన నగదు రికవరీ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Kalyana Lakshmi Forgery Case | జిల్లావ్యాప్తంగా విచారణ..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలు. పార్టీలతో సంబంధం లేకుండా నిరుపేద కుటుంబాలు ఈ పథకాల ద్వారా లబ్ది పొందాయి. అయితే ఇప్పుడు గెజిటెడ్ సంతకాల ఫోర్జరీ అంశం బయటకు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారుల దరఖాస్తులపై ఇలా నకిలీ సంతకాలు పెట్టారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద లబ్ది పొందిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతారా లేదా అనేది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న.
Kalyana Lakshmi Forgery Case | ప్రభుత్వ పథకాలకు ఎసరు పెట్టేలా ఫోర్జరీ
ఈ సంక్షేమ పథకాలకు గెజిటెడ్ సంతకం తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకుని అధికారుల చుట్టూ తిరగలేని పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ రాకెట్ నడిచింది. దీంతో అర్హులైన లబ్ధిదారులకే కాకుండా ప్రభుత్వ పథకాల పారదర్శకతపైనా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. నకిలీ స్టాంపుల మూలాలు, డబ్బు లావాదేవీలు, ఫేక్ లబ్ధిదారుల లెక్కలు కస్టడీ విచారణలో తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Yellareddy SIR Completion | ఎస్ఐఆర్లో ఎల్లారెడ్డి ప్రత్యేకం.. రాష్ట్రంలోనే మూడో స్థానం