అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | ఇటీవల కామారెడ్డి (Kamareddy) బల్దియా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బల్దియాలో కొందరు షాడో కౌన్సిలర్లు, ఇతర కౌన్సిలర్లు వసూళ్లకు తెర లేపారన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించనున్న బల్దియా సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Kamareddy Municipal Meeting |ఘర్షణల మధ్యే గత సమావేశాలు..
గడిచిన నాలుగు సమావేశాలు అభివృద్ధిపై చర్చ లేకుండానే ఘర్షణల మధ్య సాగాయి. అనుకున్న మేరకు బిల్లుల ఆమోదం, పనుల క్లియరెన్స్ జరగలేదు. ప్రస్తుతం కామారెడ్డిలో అనేక సమస్యలు కౌన్సిల్ ను వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశమైనా సజావుగా సాగుతుందా..? ఎప్పటిలాగే రణరంగాన్ని తలపిస్తుందా అనే చర్చ సాగుతోంది.
Kamareddy Municipal Meeting | రచ్చకెక్కిన వివాదం
ఇటీవల పట్టణంలో చోటుచేసుకున్న పలు ఘటనలు, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బల్దియాలో అధికారులు, నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరుపై ఆందోళనలు చేపట్టారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలు, నీటి సరఫరాలో అంతరాయం, వీధి దీపాలు వెలగకపోవడం, కుక్కల బెడద, ఓపెన్ స్థలాల ఆక్రమణలు వంటి అంశాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏం సమాధానం చెబుతారు, కౌన్సిలర్లు ఏం ప్రశ్నిస్తారు అనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
Kamareddy Municipal Meeting | ఓపెన్ స్థలాల హద్దులపై..
సమావేశంలో అత్యంత వేడిగా చర్చకు దారితీసే అంశం ఓపెన్ స్థలాల హద్దులు గుర్తింపు. మున్సిపల్ కు చెందిన ఖాళీ స్థలాలు కొన్నిచోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటి హద్దులు ఇప్పటివరకు సరిగా నిర్ధారించలేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల 16వ వార్డులో నిర్మిస్తున్న ఓ ఇంటి నిర్మాణం బల్దియాలో రాజకీయ రగడకు కారణమైంది. సంబంధిత స్థలం మున్సిపాలిటీకి సంబంధించినదని, ఆ ఇంటి నిర్మాణానికి అధికార పార్టీ నాయకులు మద్దతుగా ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించగా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం ఓపెన్ స్థలాలను గుర్తించి హద్దు రాళ్లు ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు పెట్టడం, స్థలాల వివరాలను రికార్డులలో నమోదు చేయాలని అజెండాలో ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకు ఎన్ని స్థలాలు గుర్తించారు, ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు అని కౌన్సిలర్లు గళమెత్తనున్నారు. ఏయే వార్డుల్లో ఓపెన్ స్థలాలు కబ్జా అయ్యాయో లెక్కలు అడిగే అవకాశం ఉంది.
అక్రమ వసూళ్లు, స్క్రాప్ అమ్మకాలపై చర్చించే అవకాశం
అక్రమ వసూళ్లు, స్క్రాప్ అమ్మకాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వసూళ్లు, పాత సామగ్రి, స్క్రాప్ విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గణేష్, దుర్గమాతలకు సంబంధించిన స్క్రాప్ టెండర్ చేయకుండా లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో హస్తం ఉన్న వారితో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన స్క్రాప్ అమ్మారు, వచ్చిన డబ్బు ఎక్కడ జమ అయింది, టెండర్ పాటించారా లేదా అనే అంశాలపై కౌన్సిలర్లు నిలదీసే అవకాశం ఉంది. నీటి సరఫరా, కుక్కల బెడద, ప్లాస్టిక్ నిషేధం, కోట్ల రూపాయల బిల్లుల ఆమోదం వంటి అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 2020 నుండి 2025 వరకు పెండింగ్ లో ఉన్న రూ. 4.40 కోట్ల బిల్లుల చెల్లింపు, కుక్కల బెడద నివారణకు రూ. 10 లక్షలు, మాస్ క్లీనింగ్ కోసం 40 మంది తాత్కాలిక సిబ్బంది నియామకం, తాగునీటి వృథా నివారణకు మోటార్లపై నిఘా, ఎల్ నినో ప్రభావంపై అవగాహన వంటి అంశాలపై అధికారులు, కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
సమావేశానికి ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరయ్యే అవకాశం
బల్దియా సమావేశానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వారు హాజరైతే సమావేశానికి మరింత ప్రాధాన్యత వస్తుంది. పెండింగ్ బిల్లులు, ఓపెన్ స్థలాల పరిరక్షణ, అక్రమ వసూళ్లపై వారు కూడా స్పందిస్తారా.. అనే చర్చ సాగుతోంది. పట్టణ అభివృద్ధి, నిధుల విడుదల, ప్రభుత్వ పథకాల అమలుపై వారి సూచనలు కీలకంగా మారనున్నాయి. వారి హాజరుతో సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన రబ్బర్ ఫెండర్