అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy PHCs | ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం.. పాలకుల మాటలకే పరిమితం అవుతున్నాయి. హామీలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు సరిగ్గా అందడం లేదు. ఫలితంగా తప్పనిస్థితిలో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
Kamareddy PHCs | జిల్లా వైద్యశాఖలో..
జిల్లాలో వైద్యారోగ్య శాఖలో సిబ్బంది కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం ఒకవైపు ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్ల కొరతతో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారాయి. సరైన సమయానికి చికిత్స అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Kamareddy PHCs | పేరుకే బిచ్కుంద ఆస్పత్రి..
బిచ్కుంద మండల కేంద్రంలో (Bichkunda Mandal) పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. సరైన వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, దగ్గు వంటి సాధారణ అనారోగ్యాలకు కూడా ఇక్కడ మందులు దొరకడం లేదు. దీంతో చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు 25 కి.మీ దూరంలోని బాన్సువాడకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. రాత్రిపూట ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే పరిస్థితి మరీ దయనీయం. పగలు ఒక డాక్టర్ వస్తారు, సాయంత్రం అయ్యేసరికి ఆస్పత్రి తాళం వేసేస్తున్నారు. ఎమర్జెన్సీ అంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లడమే దిక్కు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో 15 మాత్రమే డెలివరీ కేసులు జరగడం ఆస్పత్రిలో వైద్యసేవలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
Kamareddy PHCs | గాంధారి పీహెచ్సీలో డెలివరీ తిప్పలు
గాంధారి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక్కడ కీలకమైన పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక గైనిక్ డాక్టర్ పోస్టు, ఒక జనరల్ డాక్టర్ పోస్టు, ఇద్దరు స్టాఫ్ నర్సుల పోస్టులు ఎప్పటినుంచో భర్తీ కాలేదు. గైనిక్ డాక్టర్ లేకపోవడంతో ప్రసూతి విభాగం పనిచేయడం లేదు. ప్రస్తుతం గాంధారి పీహెచ్సీ 30 పడకలతోనే నడుస్తోంది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దీనిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ ఫైలు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక్కడ వ్యాపారాలు జోరుగా సాగుతుండటంతో ప్రజల రాకపోకలు తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వైద్యసేవలు అత్యవసరమని తెలిసినప్పటికీ ఆస్పత్రి అభివృద్ధిపై మాత్రం ఎవరూ దృష్టి పెట్టడం లేదు.
Kamareddy PHCs | జిల్లా వ్యాప్తంగా శాఖలో సిబ్బంది కొరత
కామారెడ్డి జిల్లాలోని చాలా పీహెచ్సీలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక డాక్టర్‌తో 2-3 సెక్షన్లు చూడాల్సి వస్తోంది. స్టాఫ్ నర్సులు సరిపడా లేకపోవడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు లేకపోవడంతో పరీక్షలు, మందుల కోసం కూడా ప్రైవేట్‌పై ఆధారపడాల్సి వస్తోంది. వైద్యులు లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. పోయినా డాక్టర్ ఉండడు, మందులు ఉండవు. అందుకే నేరుగా ప్రైవేట్‌కు వెళ్తున్నామని బిచ్కుందకు చెందిన ప్రజలు పేర్కొంటున్నారు.
Kamareddy PHCs | హోదా సరే.. వైద్యులేరి..?
బిచ్కుందకు మున్సిపాలిటీ హోదా ఇచ్చారు సరే.. కానీ కనీస వైద్య సదుపాయం కల్పించలేదని… ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్‌నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి పీహెచ్సీలో 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలంటే ముందుగా ప్రాథమిక స్థాయిలోనే బలమైన వైద్య వ్యవస్థ ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది కలగానే మిగిలిపోతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Kamareddy PHCs | గాంధారి ఆస్పత్రి అప్‌గ్రేడ్ అయ్యేనా..?
ప్రస్తుతం గాంధారి పీహెచ్సీ 30 పడకలతోనే నడుస్తోంది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దీనిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ ఫైలు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ ప్రాంతంలో వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. ప్రజల రాకపోకలు కూడా విపరీతంగా ఉంటాయి. అయినా ఆస్పత్రి అభివృద్ధిపై మాత్రం ఎవరూ దృష్టి పెట్టడం లేదు.
Kamareddy PHCs | వైద్యుల పోస్టులు భర్తీపై సందిగ్ధత
జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో 24 గంటలూ డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: SIR Forms | ఎస్ఐఆర్ ఫారాలు తిరిగివ్వకుంటే ఓటు హక్కు కోల్పోతాం : యెండల లక్ష్మీనారాయణ