అక్షరటుడే, నిజామాబాద్: Illegal Registrations | కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు.. నకిలీ పత్రాలను సృష్టించి ఇతరుల స్థలాలను కబ్జా చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ (Nizamabad) నగరంలో వెలుగు చూసిన పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. కబ్జాలకు పాల్పడుతున్న వారిలో డాక్యుమెంట్ రైటర్ల హస్త ఉండడం.. వారికి సబ్ రిజిస్ట్రార్లు సైతం సహకరిస్తుండడం ఆందోళన కలిగించే విషయం.
నిజామాబాద్ నగరంలో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 50 గజాల స్థలాన్ని కాజేసేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అయితే బాధితురాలు మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
Illegal Registrations | దొరికింది కొందరే..
తాజాగా నకిలీ సర్టిఫికెట్లతో దొరికిపోయిన వారే కాదు.. ఇలా జిల్లాలో చాలా మంది నకిలీ పత్రాలతో స్థలాలు కాజేస్తున్నారు. అధికారుల సహకారంతో డబుల్ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ స్థలాలను రాత్రిరాత్రే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సహకారం ఉండడంతోనే ఫేక్ డాక్యుమెంట్లు పుట్టుకొస్తున్నాయని తెలుస్తోంది.
Illegal Registrations | అధికారుల సహకారం..
నకిలీ ప్రతాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం వెనుక సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉందనే ప్రచారం ఉంది. దొడ్డి దారిలో డబ్బులు సంపాదించేందుకు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పలువురు డాక్యుమెంట్ రైటర్లను తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. కనీసం ఈసీని కూడా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు తరచుగా వెలుగు చూస్తున్నా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు తాత్సారం వహిస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ల తీరు మారకపోవడం గమనార్హం.
Illegal Registrations | సెలవులో అధికారి..
నగరంలోని మూడో టౌన్ పరిధిలోని అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన ముఠాకు సహకరించిన వారి కూపీ లాగుతున్నారు. కాగా.. ఇదే సమయంలో నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారి సెలవులో వెళ్లడం చర్చకు దారితీసింది. మరోవైపు వెలుగులోకి రాని అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్నో ఉన్నాయని.. వాటిని బయటకు వెలికితీయాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy PHCs | ప్రజారోగ్యం గాలికి.. పీహెచ్సీల్లో వైద్యుల్లేక రోగుల అవస్థలు..