అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karimnagar Police Station Incident | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కలకలం చోటుచేసుకుంది. వరుస దొంగతనాల కేసులో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న అజయ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Karimnagar Police Station Incident | నాలుగు రోజులుగా పోలీసుల అదుపులో..
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన అజయ్‌తో పాటు మరో ముగ్గురిని వరుస దొంగతనాల కేసులో భాగంగా ఎల్ఎండీ పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అజయ్‌ను పోలీసులు తీవ్రంగా వేధించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వేధింపులే ఈ ఘటనకు కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ నడుముకు తీవ్ర గాయమైందని, వెన్నెముక విరిగినట్లు వైద్యులు తెలిపారని కుటుంబీకులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంది.
Karimnagar Police Station Incident | గతంలోనూ ఎల్ఎండీ పోలీసులపై ఆరోపణలు
ఇదిలా ఉండగా, ఇటీవల మట్టి ట్రాక్టర్ల విడుదలకు సంబంధించి బాబు అనే వ్యక్తిని లంచం అడిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎల్ఎండీ సీఐ, ఎస్ఐలను పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Karimnagar Police Station Incident | విచారణ తీరుపై ప్రశ్నలు
దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న అజయ్‌ను అధికారికంగా అరెస్టు చూపించకుండా.. కోర్టులో హాజరుపరచకుండా చిత్రహింసలకు గురిచేశారన్నది కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. అయితే ఈ అంశాలపై స్వతంత్ర విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
అజయ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసుల వైఖరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారిక స్పందన, విచారణ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.