Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్​ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు

కొమురవెల్లి రైల్వే స్టేషన్​ను కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komuravelli Railway Station | సిద్దిపేట (Siddipet) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వెళ్లే భక్తులకు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్​ను కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ ఆదివారం ప్రారంభించారు.

కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. కొమురవెల్లిలో నూతన రైల్వేస్టేషన్‌ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. పాతిక రూపాయల టికెట్‌తోనే హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి చేరుకోవచ్చని తెలిపారు. రెండు ఏళ్లలోపే కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఈ రైల్వే స్టేషన్​తో వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Komuravelli Railway Station | లక్షలాది మంది భక్తులు

మల్లన్న దర్శనానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్​ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. అయితే ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు, ఇతర వాహనాల ద్వారా స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. బస్సుల్లో వచ్చే వారు రాజీవ్‌ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న కొమురవెల్లికి చేరుకోవడానికి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేది. ఈ క్రమంలో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. హైదరాబాద్​ నుంచి నేరుగా మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్​ నుంచి సిద్దిపేట వరకు నడుస్తున్న 4 డెమో రైళ్లు నిత్యం కొమురవెల్లిలో ఆగనున్నాయి.

ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్‌, రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : House Maid Theft | ఇళ్లను దోచేస్తున్న పని మనుషులు.. హైదరాబాద్​ పోలీసుల వార్నింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *