అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Allegations | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో పని చేసే అధికారులపై ఆయన విమర్శలు చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంగళవారం కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కొంతమంది ఐఏఎస్ అధికారులు తమ వద్దకు వచ్చే బిల్డర్లను పలాన వ్యక్తిని కలవాలని చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లను కలిసి డబ్బులు కడితేనే ఐఎఎస్ అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదని, మాఫియా నడుస్తుందని విమర్శించారు.
KTR Allegations | మెట్రో భూములపై కన్ను
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కన్ను మెట్రో భూముల మీద ఉందని కేటీఆర్ అన్నారు. మెట్రో దగ్గర రూ.30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూములను ఆయన అన్నదమ్ములకో, బావమర్ధులకో కట్టబెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అందుకే మెట్రోని స్వాధీనం చేసుకొని రూ.14 వేల కోట్ల భారం ప్రజలం మీద వేసి.. ఆ భూములను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
KTR Allegations | టెండర్లు పిలిచాం
కేసీఆర్ హయాంలో 2023లో రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేశామన్నారు. కానీ రేవంత్ రెడ్డి రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆరోజు గనక రద్దు చేయకుండా ఉంటే ఈపాటికే పూర్తి అయిపోయేదన్నారు. రెండున్నర ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. మళ్లీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందే అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro expansion | ఢిల్లీ వేదికగా మెట్రోపై చర్చలు.. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ