Medical College Ragging | ప్రిన్సిపాల్ రెగ్యులర్​గా రాకపోవడం వల్లే ర్యాగింగ్.. విద్యార్థి సంఘాల ఆందోళన

మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Medical College Ragging | మెడికల్ కళాశాల (Medical College)లో ర్యాగింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రిన్సిపాల్ రెగ్యులర్​గా రాకపోవడం.. పర్యవేక్షణ లేకపోవడం వల్లే కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు విద్యార్థి నాయకులు గురువారం కళాశాలను ముట్టడించి ప్రిన్సిపాల్​ను ఘెరావ్​చేశారు.

Medical College Ragging | సీనియర్ల వేధింపులు తాళలేక..

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా విద్యార్థి సంఘాలు గురువారం మెడికల్ కళాశాల ముట్టడించారు. కళాశాల వద్దకు ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు నేరుగా రెండవ ఫ్లోర్​లోని ప్రిన్సిపాల్ ఛాంబర్​లో ప్రిన్సిపాల్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో ప్రిన్సిపాల్ డా. వాల్యా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. దాంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలో ర్యాగింగ్ జరగడానికి ప్రిన్సిపాలే కారణమని, ఆయన రెగ్యులర్ గా కళాశాలకు రాకుండా ఉండటం వల్లనే పర్యవేక్షణ లేక ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.

Medical College Ragging | రెండు గంటల పాటు ఆందోళన

Medical College Ragging

ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సుమారు గంటకు పైగా ఛాంబర్​లోనే బైఠాయించి నిరసన కొనసాగించారు. ప్రిన్సిపాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థి సంఘ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్ వచ్చి సమాధానం చెప్పాలని నాయకులు పట్టుబట్టారు. ఎస్సై విజ్ఞప్తి మేరకు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆందోళన కొనసాగించారు.

Medical College Ragging | నిజామాబాద్​, గాంధీ కళాశాలల్లో ర్యాగింగ్ జరిగితే..

అనంతరం ఛాంబర్​కు వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధ్యులను సస్పెండ్ చేశామని వివరించారు. అయితే ప్రిన్సిపాల్ రాకపోవడం వల్లనే ఈ ర్యాగింగ్ జరిగిందని, దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దానికి ప్రిన్సిపాల్ వింతైన సమాధానమిచ్చారు. నిజామాబాద్, గాంధీ లాంటి మెడికల్ కళాశాలల్లో ర్యాగింగ్ జరిగితే అక్కడి ప్రిన్సిపాల్స్ రాజీనామా చేస్తారా అంటూ తిరిగి  ప్రశ్నించారు. అయితే తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. ర్యాగింగ్ జరిగిన సమయంలో వార్డెన్, డిప్యూటీ వార్డెన్ల నిర్లక్ష్యం ఉంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నాయకులు నిలదీశారు.

Medical College Ragging | మీడియాపై రుసరుసలు

Medical College Ragging

కళాశాలలో విద్యార్థి సంఘాల నిరసన కవరేజీకి వెళ్లిన మీడియాపై ప్రిన్సిపాల్ డా. వాల్యా అసహనం వ్యక్తం చేశారు. ర్యాగింగ్​ను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అనేలా వ్యాఖ్యానించగా మీడియా ప్రతినిధులు ప్రిన్సిపాల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ర్యాగింగ్ బాధితులు మీడియాను కలిసి మాట్లాడారా అంటూ ప్రిన్సిపాల్ అనడంతో జర్నలిస్టులు ప్రిన్సిపాల్ తీరును తప్పుబట్టారు. తాను చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని, మీడియా తమకు సహకరించాలని కోరారు.

Medical College Ragging | ర్యాగింగ్​పై విచారణ కొనసాగుతోంది

కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై విచారణ కొనసాగుతుందని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వాల్యా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గత నెల 25న ఫస్టియర్​ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఎన్​హెచ్​ఎంకు నేరుగా ఫిర్యాదు వెళ్లిందన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని తమకు సమాచారం రాగానే కమిటీలో చర్చించి 28న 14 మందిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు. ఇందులో నలుగురు హాస్టల్ విద్యార్థులు ఉండగా 10 మంది డేస్కాలర్స్ విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. హాస్టల్​లో బయట విద్యార్థుల వల్లే ర్యాగింగ్ జరిగిందని తెలిపారు. విచారణలో రెండు మూడు రోజుల నుంచి ర్యాగింగ్ జరుగుతున్నట్టు తేలిందని పేర్కొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు నలుగురు విద్యార్థులపై 6 నెలలు, 10 మందిపై నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించినట్టు తెలిపారు. హాస్టల్​కు వార్డెన్ లేడని, సూపర్​వైజింగ్, సమస్యలు వస్తే చేసుకోవడానికి ఇన్​ఛార్జీలు మాత్రమే ఉన్నారన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని, యాంటీ ర్యాగింగ్ టీంను బలోపేతం చేస్తామన్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందో లేదోనన్న అనుమానంతో నేరుగా ఎన్​హెచ్​ఎంకు ఫిర్యాదు చేసి ఉంటారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

Medical College Ragging | ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలి

మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రెగ్యులర్ గా ప్రిన్సిపాల్ కళాశాలకు రావడం లేదని, హైదరాబాద్ లోనే ఉంటూ పని చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోకుండా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర కో కన్వీనర్ జీవియం విఠల్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్, పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సాయినాథ్, ఏఐఎస్ఏ జిల్లా ఇన్​ఛార్జి పెరుమాండ్ల బుల్లెట్, బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, జీవిఎస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, ఏఐఎస్ఏ పట్టణ అధ్యక్షుడు రోహిత్, గడం రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Armoor Municipal Meeting | వాడీవేడీగా ఆర్మూర్​ మున్సిపల్​ సాధారణ సమావేశం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *