అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Metro Common Pass | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణించే వారి కోసం ప్రభుత్వం కామన్ పాస్ తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని ధరలు భారీగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఆర్టీసీ+మెట్రో నెలవారి పాస్ ధర రూ.8500, రోజువారి పాస్ ధర రూ.400గా నిర్ణయించారు. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పాస్ ద్వారా, ఒకే కార్డుతో మెట్రో రైలు, నిర్దిష్ట RTC సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ధరలు అధికంగా ఉండటంతో పాస్‌ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అంతేగాకుండా విమర్శలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు, ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే అంశంపై త్వరలోనే అధికారులతో సంప్రదింపులు జరుపుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే, ధరల తగ్గింపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Metro Common Pass | జీతంలో సగం అటే..
హైదరాబాద్ నగరంలో చాలా మంది రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు జీతానికి పని చేసే వారు ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. వీరే ఎక్కువగా మెట్రో, ఆర్టీసీలో ప్రయాణిస్తారు. అయితే తాజాగా తెచ్చిన పాస్‌తో అలాంటి వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. నిత్యం టికెట్ తీసుకొని వెళ్లినా అంత ధర కాదని ప్రజలు అంటున్నారు. రూ.15 వేల జీతంతో పని చేసేవారు.. మెట్రో పాస్ తీసుకుంటే సగం జీతం అటే పోతుందని విమర్శిస్తున్నారు. మెట్రో, బస్సు సర్వీసులు వినియోగించినా.. తమ గమ్య స్థానాలకు చేరాలంటే మళ్లీ ఆటోలు, ర్యాపిడోలు ఆశ్రయించక తప్పదని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.8,500 పెట్టి మెట్రో పాస్ తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు. పాస్ ధరను రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య పెడితే ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Bullet Train | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, పుణెకు హైస్పీడ్ రైలు కారిడార్లు.. దక్షిణ భారత రవాణా ముఖచిత్రం మారనుందా?