MI vs SRH | నేడు ముంబై ఇండియన్స్‌కు చావో రేవో మ్యాచ్.. సన్‌రైజర్స్‌తో ఓడిపోతే ప‌రిస్థితి ఏంటి?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MI vs SRH | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలే సాధించి, 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉండగా, నెట్‌రన్‌రేట్ -0.736గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 29) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుతో జరిగే మ్యాచ్ ముంబైకి అత్యంత కీలకంగా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. సొంత మైదానంలో జరుగుతున్న ఈ పోరులో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది.

MI vs SRH | గెలిస్తే ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగా..

ఈ మ్యాచ్ ముంబైకి దాదాపు ‘చావో రేవో’ మ్యాచ్‌గా మారింది. గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిపోతే మాత్రం ఆ అవకాశాలు చాలా క్లిష్టంగా మారనున్నాయి. గత సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే, సాధారణంగా 8 విజయాలు సాధించిన జట్లు టాప్-4లోకి చేరి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తున్నాయి. 9 మ్యాచ్‌లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశముంటుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ఇప్పటికే 5 మ్యాచ్‌లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారగా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

MI vs SRH | ఇకపై ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లా ఆడాల్సిందే

హెడ్-టు-హెడ్ రికార్డులు పరిశీలిస్తే, ఈ రెండు జట్లు ఇప్పటివరకు 34 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ గణాంకాలు కూడా సన్‌రైజర్స్‌కు కొంత ఆధిక్యత ఉన్నట్టు సూచిస్తున్నాయి. మొత్తానికి, ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ముంబై ఇండియన్స్ ఇకపై ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లా ఆడాల్సిందే. ఈ రోజు జరిగే పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి..: Riyan Parag Vaping | డ్రెస్సింగ్ రూమ్‌లో ద‌మ్ముకొట్టిన‌ రియాన్ పరాగ్..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *