అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khelo India Youth Games | తెలంగాణ Telangana ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.
Khelo India Youth Games | డిసెంబరులో పోటీలు..
జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
Khelo India Youth Games | క్రీడా వేడుకలకు సినీ తారలు..
ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
Khelo India Youth Games | పోటీ ప్రదేశాల గుర్తింపు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణా రావు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ ఎ. సోనీబాల దేవి పాల్గొన్నారు.