Modi Hyderabad Visit | మే 10న భాగ్యనగరానికి మోదీ.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Modi Hyderabad Visit | మే 10 ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఐటీ కారిడార్‌లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, సికింద్రాబాద్ వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా, అత్యున్నత భద్రతా నియమాల ప్రకారం హైదరాబాద్‌లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Modi Hyderabad Visit | హైటెక్ సిటీలో ఆసుపత్రి ప్రారంభోత్సవం..

ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి (Begumpet Airport) చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రయాణించి మధ్యాహ్నం 3.45 గంటలకు హైటెక్ సిటీ సమీపంలోని సింధు ఆసుపత్రికి చేరుకుంటారు. ఈ అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం, ఆయన తిరిగి బేగంపేట చేరుకుంటారు. సమయాన్ని బట్టి అక్కడ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతకుముందు బేగంపేటలోనే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు.

Modi Hyderabad Visit | సికింద్రాబాద్‌లో ‘జన ఆక్రోష్ సభ’..

పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ (Secunderabad Parade Grounds)లో జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని ‘జన ఆక్రోష్ సభ’ బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటపాటు సాగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మోదీ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సభ ముగిసిన తర్వాత రాత్రి 6.45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరుతారు.

Modi Hyderabad Visit | ‘బ్లూ బుక్’ ప్రోటోకాల్‌తో భారీ భద్రత..

ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ (Hyderabad)లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపిల రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య ‘బ్లూ బుక్’ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. డీజీపీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ రమేష్ నేతృత్వంలో పోలీసులు ఇప్పటికే పర్యటన సాగే మార్గాలను, సభ వేదికను స్వయంగా తనిఖీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట, హైటెక్ సిటీ , సికింద్రాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు , మళ్లింపులు విధించనున్నారు.

ఇది కూడా చదవండి..: Smart Policing Malkajgiri| మల్కాజ్‌గిరి ‘మహిళా’ బాస్ స్టింగ్ ఆపరేషన్.. సామాన్యురాలిగా రోడ్డుపైకి.. 40 మంది పోకిరీలకు చెక్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *