అక్షరటుడే, ఎల్లారెడ్డి : Mosquito Fever Outbreak | ఉమ్మడి జిల్లాపై దోమలు దండు దాడి చేస్తోంది. వెంటపడి మరీ రక్తం పీల్చేస్తున్నాయి. ఇంట్లో, ఆరుబయట కాసేపు ప్రశాంతంగా ఉందామన్నా ఉండనివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లె, పట్టణం అంటూ తేడాలేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. మురుగు కాలువల పరివాహక ప్రాంతాలు, బస్తీల్లో దోమల సమస్య మరింత జటిలంగా ఉంది. ఇంత జరుగుతున్నా మున్సిపల్, ఆరోగ్య శాఖ సిబ్బందిలో చలనం లేకుండా పోయింది.
మురుగు నిల్వలతో పాటు దోమల దండుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో జ్వరాలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గత రెండు మూడు వారాలుగా సీజన్లు మారుతున్న నేపథ్యంలో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ మురుగు కాలువలు, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో వర్షం నీరు నిల్వ, పైప్లైన్ లీకేజీలు ఉండటంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి.
Mosquito Fever Outbreak | ఆస్పత్రుల్లో రోగుల రద్దీ
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ ఏరియా ఆస్పత్రుల్లో జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో ఓపీకి వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైరల్ జ్వరాలు, కీళ్లు, కండరాల నొప్పుల వల్ల రోగులు కనీసం నిలబడలేక, తీవ్రమైన నీరసంతో మంచాన పడుతున్నారు. డెంగీ బారిన పడిన వారికి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా క్షీణిస్తుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హఠాత్తుగా 102నుంచి 104 వరకు జ్వరం రావడం, చలి, వణుకుతో రోగులు అల్లాడిపోతున్నారు.
Mosquito Fever Outbreak | దోమల ద్వారా వచ్చే వ్యాధులు
పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సీజన్లో ముఖ్యంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటితో పాటు కామెర్లు (జాండిస్), కలరా వచ్చే అవకాశం ఉంది. గాలిద్వారా వచ్చే వైరస్లు ఇన్ఫ్లుయెంజా, సాధారణ వైరల్ జ్వరాలు గాలిద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తున్నాయి.
Mosquito Fever Outbreak | పట్టణాల్లో ఘోరం..
పట్టణాల్లోని మురుగు కాల్వలు (నాలాలు), ఓపెన్ డ్రెయిన్లు, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలు, ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. పలు కాలనీల్లో రహదారిపై నీరు నిలుస్తోంది. పారిశుధ్య పనులు సక్రమంగా జరగక దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాల కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు.
Mosquito Fever Outbreak | శాఖల మధ్య సమన్వయ లోపం..
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దోమలు పెరుగుతున్నాయంటే రెండు శాఖలు మేం బాగానే పనిచేశామని, వాళ్లదే తప్పు అన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులున్న కాలనీల్లో ఫాగింగ్ కార్యక్రమాలు కొంత వరకు మెరుగ్గా ఉన్నా.. ఇతర ప్రాంతాలకు ఫాగింగ్ యంత్రం వచ్చిన దాఖలాలే లేవు.
Mosquito Fever Outbreak | వైద్యుల సూచనలివే..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్ వాడాలి. జ్వరం వస్తే సొంత మందులు వాడకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Mosquito Fever Outbreak | ఆగస్టులో 65వేలకు పైగా ఓపీ కేసులు

కామారెడ్డి జిల్లాలోని అన్ని టీవీపీ ఆస్పత్రుల్లో ఆగస్టు – 2026 నెలలో ఓపీ, ఐపీ, జ్వరాలు, కేసుల వివరాలను జిల్లా ఆస్పత్రికి సూపరింటెండెంట్ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 8 ఆస్పత్రులతో కలిపి మొత్తం 65,002 ఓపీ కేసులు, 5,028 ఐపీ కేసులు నమోదయ్యాయి. ఇందులో జ్వర కేసులు 5,293 నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాకుండా ప్రైవేట్లో వందల సంఖ్యలో ప్రజలు వివిధ రుగ్మతలతో బాధపడుతూ చికిత్సలు పొందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..