అక్షరటుడే వెబ్డెస్క్: MRP Overcharging Fine | కేవలం ఏడు రూపాయల అధిక లాభం కోసం కక్కుర్తి పడిన ఓ వ్యాపారికి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ గట్టి షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేసినందుకు ఏకంగా రూ.7 లక్షల భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన డి.వెంకటేశ్వరరావు అనే భక్తుడు ఫిబ్రవరి 22న అన్నవరం ( Annavaram )శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో సత్యగిరిపై ఉన్న ‘సత్యదేవ ఫ్యాన్సీ, కొబ్బరికాయలు, కూల్డ్రింక్స్’ దుకాణంలో ఆయన ఓ వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. ఆ బాటిల్ గరిష్ఠ చిల్లర ధర (MRP) కేవలం రూ.18 మాత్రమే ఉన్నప్పటికీ, దుకాణదారుడు మాత్రం రూ.25 వసూలు చేశాడు.
MRP Overcharging Fine | రూ.7 అదనంగా వసూలు..
నిర్ణీత ధర కంటే రూ.7 అదనంగా వసూలు చేయడంపై భక్తుడు దుకాణదారుడిని ప్రశ్నించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన ఆధారాలతో సహా అన్నవరం ఆలయ అధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆలయ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, న్యాయం కోసం కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
MRP Overcharging Fine | బలమైన హెచ్చరికగా..
ఈ పిటిషన్పై జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు సీహెచ్. రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావులు సమగ్ర విచారణ జరిపారు. దుకాణదారుడు నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ కంటే అధిక ధర వసూలు చేసినట్లు విచారణలో తేలింది. భక్తులను మోసగించి దోపిడీకి పాల్పడుతున్న సదరు వ్యాపారికి బుద్ధి చెప్పేలా రూ.7 లక్షల భారీ జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది. పుణ్యక్షేత్రాలలో ఇలా భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేసే మోసపూరిత వ్యాపారులకు ఈ తీర్పు కంటిన్యూగా బలమైన హెచ్చరికగా నిలుస్తుందని వినియోగదారుల హక్కుల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Sabitha Indra Reddy | మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేదు : సబితా ఇంద్రారెడ్డి