అక్షరటుడే, వెబ్‌డెస్క్: Narsingi Road Alignment | మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం ప్రభుత్వం రెండు వేల ఇళ్లను కూల్చేందుకు యత్నిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నార్సింగిలో 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్ మార్చడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు అలైన్‌మెంట్ మార్చడంతో నష్టపోనున్న బాధితులతో శనివారం ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాధా రియల్టర్స్ బిల్డర్ కోసం 2,000 ఇళ్లు కూల్చివేసి 5,000 మందిని రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 ఫీట్ల అలైన్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దాంతో హనుమంతుడి గుడి పోతుందని ప్రజలు చెప్పారన్నారు.
Narsingi Road Alignment | ప్రజలకు ఇబ్బంది లేకుండా..
ప్రజల కోరిక మేరకు 2018లో కేసీఆర్ గుడి కూల్చివేయకుండా, ఇళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వేయాలని ఉత్తర్వులు ఇచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల కోసం, RR రియల్ ఎస్టేట్ సంస్థ కోసం తాజాగా రోడ్డు అలైన్‌మెంట్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసి, పాత అలైన్‌మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Narsingi Road Alignment | రేవంత్‌రెడ్డి హస్తం ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో మట్టికొట్టుకొని పోతదని బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం, తన ఆస్తుల కోసం ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల ఇండ్లను కూల్చివేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మాస్టర్ ప్లాన్‌లో 2013లో జనావాసాలకు ఇబ్బంది కలగకుండా 100 ఫీట్ల రోడ్డు ప్లాన్ చేశారన్నారు. కానీ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఆఫీసులో ఒక ఛాంబర్‌లో రాధా రియాలిటీకి సంబంధించిన రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి కూర్చుంటాడని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి కొన్న భూముల కోసం ప్రస్తుతం రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని, దీని వెనుక సీఎం హస్తం ఉందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన