అక్షరటుడే, బోధన్: Navipet Railway Gate | వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపున విరామం ఇస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వల్ల ఏర్పడిన నరకం మాత్రం వాహనదారులను వెంటాడుతూనే ఉంది.
నవీపేట్ రైల్వేగేట్ వద్ద ఏర్పడిన భారీ గుంతలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై అధికారులు కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Navipet Railway Gate | నిత్యం ట్రాఫిక్ నరకం!
నవీపేట్ రైల్వేగేట్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే కీలకమైన కూడలి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు, వాహనదారులు ఈ దారి మీదుగానే ప్రయాణిస్తారు. అలాంటిది వర్షాల ధాటికి గేటు సమీపంలో రోడ్డు మొత్తం గుంతలమయమై గోతులను తలపిస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.
Navipet Railway Gate | ప్రయాణికుల ఆవేదన
“ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక భారీ వాహనం ఈ గుంతల్లో ఇరుక్కుపోవడం.. గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం నిత్యకృత్యమైంది. అధికారులు, పాలకులు కళ్ళున్నా చూడలేని స్థితిలో ఉన్నారు..” అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే అధికారులకు వినతిపత్రం
రహదారి పరిస్థితి దయనీయంగా మారడంతో, ప్రజా సమస్యలను గమనించిన నవీపేట్ పాలకవర్గ సభ్యులు శుక్రవారం రైల్వే అధికారులను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — పాలకుల అలసత్వం, పర్యవేక్షణ లోపం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని మండిపడ్డారు. గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తగదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: షూటింగ్లో నటి రష్మికకు గాయాలు