అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Flood Alert | చైనా( China ), నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్‌లో ఇప్పటికే నెలకొన్న వరద ముప్పు మరింత తీవ్రరూపం దాల్చింది. మూడు రోజుల క్రితం వచ్చిన వరద కంటే దాదాపు ఐదు రెట్లు అధిక తీవ్రతతో మరో ప్రమాదకరమైన వరద ముంచుకొస్తోందని స్థానిక అధికారులు హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా దూసుకొస్తున్న ఈ వరద మరో 20 నిమిషాల్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో, ఆయా ప్రాంతాల్లో తక్షణమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు, యాత్రికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.
Nepal Flood Alert | నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్లు..
ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం, భద్రతా దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, తాజా వరద ముప్పు కారణంగా అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ : కవిత