Nepal Tibet Floods | 691కు చేరిన నేపాల్‌ వరద మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తు కారణంగా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు, ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Tibet Floods | ప్రకృతి విలయానికి నేపాల్‌ – టిబెట్​ Tibet ప్రాంతాలు వణికిపోయాయి. ఉప్పొంగిన వరదలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసినా బురద, శిథిలాలు.. తమవారిని వెతుక్కుంటూ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం నేపాల్‌ వరదల్లో ఇప్పటివరకు 691 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,500 మంది ఆచూకీ తెలియకుండా గల్లంతయ్యారు. టిబెట్​లో 16 మంది మరణించగా.. 546 మంది గల్లంతయ్యారు. వరద ఉద్ధృతికి అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Nepal Tibet Floods | వేలాది మంది ఆచూకీ కోసం ఎదురుచూపులు

గల్లంతైన వారిలో 287 మంది భారతీయులు, 517 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తు కారణంగా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు, ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ప్రవాహం అనేక కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. తమ కుటుంబ సభ్యులు బతికే ఉన్నారన్న ఆశతో బాధితుల బంధువులు అధికారుల నుంచి వచ్చే సమాచారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Nepal Tibet Floods | 4,400 మందికి పునర్జన్మ

మరోవైపు సహాయక బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 4,400 మందిని సురక్షితంగా రక్షించారు. వరదల కారణంగా టిబెట్‌లో చిక్కుకుపోయిన 120 మంది భారతీయులను మరో మార్గం ద్వారా నేపాల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

KNRUHS Fee Hike | మెడికల్‌ విద్యార్థులకు షాక్‌.. యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంపు

ప్రమాదకర పరిస్థితుల మధ్య వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం సహాయక చర్యల్లో కీలక ముందడుగుగా నిలిచింది. అయితే ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Nepal Tibet Floods | విషాదంలో మునిగిన సరిహద్దు ప్రాంతాలు

వరదలు తగ్గుముఖం పట్టినా వాటి మిగిల్చిన విషాదం మాత్రం ఇప్పట్లో చెరిగిపోయేలా కనిపించడం లేదు. ఇళ్లు, రహదారులు, వంతెనలు, జీవనాధారాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కళ్లెదుటే తమ ఇళ్లు, ఆస్తులు, ఆత్మీయులను కోల్పోయిన ప్రజల రోదనలు ఈ ప్రకృతి విపత్తు తీవ్రతను తెలియజేస్తున్నాయి.

ఒకవైపు మృతదేహాల కోసం గాలింపు.. మరోవైపు గల్లంతైన వారి కోసం ఆత్రుతగా ఎదురుచూపులు.. ఇంకోవైపు ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు.. నేపాల్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *