అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad District | ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగితారాణా (Special Officer Yogita Rana) ప్రశంసించారు. కలెక్టరేట్ లో పాలనాధికారి ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Nizamabad District | ఇందిరమ్మ గృహాల్లో..
జిల్లాలో (Nizamabad) ఒకే రోజు 3,304 ఇందిరమ్మ గృహాల్లో (Indiramma Housing) గృహ ప్రవేశాలు, డివిజన్లలో శ్రమదానాలు.. సంక్షేమ వసతి గృహాలు (Welfare Schemes), రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహణపై అధికారులను యోగితా రాణా అభినందించారు. ట్రాన్స్ జెండర్ల సమస్య పరిష్కారానికి కలెక్టర్ మానవీయ కోణంలో చొరవ చూపుతూ కృషి చేయడం ఇతరులకు స్పూర్తిదాయకమన్నారు. దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు.
Nizamabad District | తాను జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు..
తాను జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన సమయంలో ఉపాధి హామీ, ఈ-నామ్, హరితహారం తదితర కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులు నిజామాబాద్‌ను అగ్రభాగాన నిలిపారన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో కృషి చేస్తూ, జిల్లా యంత్రాంగం ప్రతిష్టను ఇనుమడింపజేయాలని యోగితా రాణా సూచించారు. ప్రభుత్వం అనేక వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు.
Nizamabad District | అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు..
అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును రాష్ట్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Nizamabad District | విద్యారంగాన్ని బలోపేతం చేయడం..
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని యోగితా రాణా అన్నారు. ఆయా ప్రాంతాలలో మెరుగైన విద్యా విధానం గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో కూడిన బృందాలను దేశ, విదేశాలకు సైతం పంపిందని గుర్తు చేశారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను సర్కారు బడులలో అందించేలా కోట్లాది రూపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పుతోందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయన్నారు.
Nizamabad District | దశలవారీగా అల్పాహారం..
దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వచ్చే నాలుగు నెలల్లో అల్పాహారం, మద్యాహ్న భోజనం అమలులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్కులు, యూనిఫాంలతో పాటు ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకురుస్తోందని వివరించారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేస్తూ, ప్రభుత్వ బడుల పట్ల వారిలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, ఇతర అధికారులు సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ బడులలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని అన్నారు.
Nizamabad District | పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై..
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు పది ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా అన్ని శాఖలలో పెండింగ్ ఫైళ్లు పరిష్కరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా జీపీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణలో, రైతులకు బిల్లుల చెల్లింపుల్లో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని, కొత్త రేషన్ కార్డులు మంజూరు, మెగా జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ బడులలో చేర్పించడం జరిగిందని, ఇతర వినూత కార్యక్రమాలను అమలు చేశామని కలెక్టర్ తెలిపారు. సమీక్షలో సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత, ట్రెయినీ కలెక్టర్ సురేష్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ ఆర్డీవో సందీప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు లింగమనేని రమేష్