అక్షరటుడే, వెబ్డెస్క్ : NSE IPO Listing | 1992లో స్థాపించబడి, 1993 ఏప్రిల్ లో సెబీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్గా గుర్తింపు పొంది, 1994లో కార్యకలాపాలను ప్రారంభించిన ఎన్ఎస్ఈ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన విశ్వసనీయమైన మార్కెట్ సంస్థగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ మార్కెట్లలో ఒకదానిగా ఎదిగిన ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఐపీవో ద్వారా రూ. 22,561.57 కోట్లను సమీకరించింది. లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ. 4.5 లక్షల కోట్లుగా నిలిచింది.
NSE IPO Listing | దేశంలోనే రెండో అతిపెద్ద ఐపీవో..
హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మార్కెట్నుంచి రూ.27,870 కోట్లు సమీకరించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచింది. గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఎన్ఎస్ఈ రూ.22,561.57 కోట్ల నిధులు సమీకరించడం ద్వారా దేశంలో రెండో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించింది. కాగా 2022లో లిస్టయిన ఎల్ఐసీ మార్కెట్ నుంచి సుమారు రూ. 21 వేల కోట్లు సమీకరించి 3వ అతిపెద్ద ఐపీవోగా ఉంది.
NSE IPO Listing | స్పందన అంతంతే..
భారీ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి స్పందన నామమాత్రంగా లభించింది. మొత్తం కోటా 5.71 రెట్లు సబ్స్క్రైబ్ కాగా.. క్యూఐబీ కోటా 12.68 రెట్లు, ఎన్ఐఐ కోటా 6.55 రెట్లు, రిటైల్ కోటా 1.39 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది.
NSE IPO Listing | 0.84 శాతం లాభంతో..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ షేర్లు గురువారం బీఎస్ఈలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 1,785 కి విక్రయించగా.. 0.84శాతం ప్రీమియంతో కేవలం రూ.15 లాభంతో రూ.1800 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. మార్కెట్లో అరంగేట్రం చేసిన కొద్దిసేపటికే ఎన్ఎస్ఈ షేర్లు 5 శాతం వరకు లాభపడి ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన రూ. 1,878కి చేరుకున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సుమారు 4 శాతం లాభంతో రూ. 1,854 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 24 Gold Prices | మళ్లీ ఎగిసిపడుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి!