అక్షరటుడే, వెబ్‌డెస్క్: NTPC project accident | జార్ఖండ్‌లోని ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ (NTPC) ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చత్రా జిల్లా తాండవాలోని నార్త్ కరణ్‌పురా ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
NTPC project accident | నిర్మాణ లోపమే ప్రాణాలు తీసిందా?
నవంబర్ 17-18 తేదీల్లో నార్త్ కరణ్‌పురా ప్రాజెక్టు సైట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చరల్ డిజైన్‌లో ఉన్న లోపం కారణంగానే అది ఒక్కసారిగా కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ‘సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్’ (Simplex Infrastructures), ‘థైసెన్‌క్రప్’ (ThyssenKrupp) సంస్థల తరఫున పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించారు.
NTPC project accident | రంగంలోకి అధికారులు..
ఈ దుర్ఘటనపై ఎన్టీపీసీ ప్రతినిధి స్పందిస్తూ.. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని వెల్లడించారు.
NTPC project accident | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి
ఎన్టీపీసీ ప్రమాద ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా స్పందిస్తూ.. “గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను” అని పేర్కొన్నారు. తోటి కార్మికుల మృతితో ప్రాజెక్టు వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..