అక్షరటుడే, వెబ్‌డెస్క్: Public Prosecutor caught in ACB trap | చట్టాన్ని కాపాడుతూ, బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన న్యాయ వ్యవస్థలోని కొందరు కీలక వ్యక్తులే కంచె చేను మేసిన చందంగా అవినీతి బాట పడుతున్నారు. కేసులను నీరుగార్చేందుకు, నిందితులను నిర్దోషులుగా తప్పించేందుకు ఏకంగా లక్షల్లో బేరసారాలు సాగిస్తూ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు.
తాజాగా పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) దొంకెన రవీందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Public Prosecutor caught in ACB trap | కేసు కొట్టేయడానికి రూ. 1.50 లక్షల డీల్..
ధర్మారం పోలీస్ స్టేషన్లో నమోదై, పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టులో విచారణలో ఉన్న ఒక క్రిమినల్ కేసు (Cr.No.12/2023) లో నిందితులకు అనుకూలంగా వ్యవహరించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్ అవినీతికి తెరలేపారు.
సాక్షులను నిందితులకు అనుకూలంగా విచారించి, కేసును నిర్దోషిగా (Acquittal) ముగించేందుకు ఆయన మొదట రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి బతిమాలడంతో చివరికి రూ. 1,50,000 కు డీల్ కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో పెద్దపల్లి పట్టణంలోని తన నివాసంలోనే రెడ్డిరాజుల రాజయ్య అనే ప్రైవేట్ వ్యక్తి (మధ్యవర్తి) ద్వారా రూ. 1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ బృందం పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Public Prosecutor caught in ACB trap | అవినీతిని ఎదిరిద్దాం..
ఇలాంటి అవినీతిపరులకు చట్టపరంగా తగిన శాక్ష్యాలతో బుద్ధి చెబితేనే రాజకీయాల్లో ప్రక్షాళన సాధ్యమవుతుంది. ప్రజాధనాన్ని దోచుకునే ఏ ఒక్క ప్రజాప్రతినిధిని, అధికారినైనా వదిలిపెట్టకూడదు.
వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి లంచావతారాలను కట్టడి చేయడంలో ప్రజల పాత్ర కూడా కీలకం. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రజాప్రతినిధి అయినా, న్యాయాధికారులైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలి.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏసీబీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా సమస్య ఎదురైతే.. టాల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106, సోషల్ మీడియా ఎక్స్ (Twitter), ఫేస్బుక్లో (@Telangana ACB) సంప్రదించవచ్చని సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..