Online Stock Trading Fraud | ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్ల బురిడీ.. రూ.16.32 లక్షలు ఊడ్చేసిన చెన్నై ముఠా సభ్యుడి అరెస్టు

మరిన్ని నిధులు పంపాలని ఒత్తిడి చేయడంతో పాటు, డిపాజిట్ చేసిన సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Online Stock Trading Fraud | ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను ముంచేస్తున్న మరో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి ఆటకట్టించారు సిద్దిపేట పోలీసులు. అధిక లాభాల ఆశచూపి ఓ వ్యక్తి నుంచి రూ.16.32 లక్షలు కాజేసిన కేసులో తమిళనాడులోని చెన్నైకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.

Online Stock Trading Fraud | నకిలీ యాప్‌లు, వాట్సాప్ గ్రూపులతో వల..

పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడిని గుర్తుతెలియని వ్యక్తులు ‘జడ్4 హై ప్రాఫిట్ స్టాక్ స్టడీ’ అనే వాట్సాప్ గ్రూప్‌లో అక్రమంగా చేర్చారు. తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెబీ (SEBI) గుర్తింపు పొందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రతినిధులమంటూ బాధితుడిని నమ్మించారు. స్టాక్ మార్కెట్‌లో డిపాజిట్ చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ ఆశచూపి, ఒక నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో ఖాతా తెరిపించారు.

ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి, బాధితుడి డిజిటల్ స్క్రీన్‌పై భారీగా లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా మొత్తం ఏడు సార్లు వివిధ ఖాతాలకు రూ. 16,32,000 జమ చేశాడు.

ఆ తర్వాత మరిన్ని నిధులు పంపాలని ఒత్తిడి చేయడంతో పాటు, డిపాజిట్ చేసిన సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు.

Online Stock Trading Fraud | రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్..

ఫిర్యాదు స్వీకరించిన సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిశితంగా పరిశీలించారు. ప్రధానంగా నిధులు బదిలీ అయిన ఖాతా ఆధారంగా చెన్నైకి చెందిన ప్రవీణ్ కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సైబర్ మోసాల నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర ముఠా సభ్యుల వివరాలు, మిగతా బ్యాంక్ ఖాతాల మూలాలపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీపీ తెలిపారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

సకాలంలో స్పందించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సైబర్ క్రైమ్ డీఎస్పీ పి.రాజుతో పాటు దర్యాప్తు బృందంలోని అధికారులు, సిబ్బందిని కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు. గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ యాప్‌ల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *