Pension Applications | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. పింఛన్​ దరఖాస్తుల గడువు పొడిగింపు

పింఛన్​ కోసం దరఖాస్తు గడువును మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు పొడిగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pension Applications | పింఛన్​ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. పింఛన్​ కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు అధికారులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో లక్షలాది మంది పెన్షన్​ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఆన్​లైన్​లో పింఛన్​ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. అయితే పింఛన్​ కోసం కావాల్సిన పత్రాలు అందడంలో జాప్యం నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తు గడువు పొడిగించాలని కోరారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం మరో 15 రోజులు గడువు పెంచింది.

Pension Applications | దరఖాస్తుల వెల్లువ

చేయూత పింఛన్ల కోసం ఆదివారం వరకు 4.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా వితంతువులు ఉన్నారు. అయితే సోమవారం 50 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే దరఖాస్తు కోసం ఇన్​కమ్​, క్యాస్ట్​, ఫ్యామిలీ మెంబర్​ ఇతర సర్టిఫికెట్లు అందక చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. తాజాగా గడువు పొడిగించడంతో వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం కొత్తగా 2.50 లక్షల పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి.. కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది.

Pension Applications | వారి సంగతి ఏమిటో?

రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో వృద్ధాప్య పింఛన్​ వయసును 57 ఏళ్లకు తగ్గించారు. 2022 ఆగస్టులో కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. నాలుగేళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వలేదు. దీంతో 57 ఏళ్లు వచ్చిన వారు లక్షలాది మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్​ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. అందులో వృద్ధాప్య పింఛన్​ లేకపోవడం గమానర్హం. దీంతో వారు నిరాశ చెందుతున్నారు. తమకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా వృద్ధాప్య పింఛన్లు ఇస్తే ప్రభుత్వం భారీగా భారం పడే అవకాశం ఉంటడంతో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలుస్తోంది.

దీనిని కూడా చదవండి : IVF Services | ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు : మంత్రి రాజనర్సింహ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.