PM Modi Athletes Meet | దేశం పటంపట్ల లవ్లీనా చూపిన బాధ్యత, అప్రమత్తత ఎంతో అభినందనీయం: ప్రధాని మోదీ

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PM Modi Athletes Meet | కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించిన ప్రధాని, అథ్లెట్లకు లడ్డూలు తినిపించి అభినందించారు. ముఖ్యంగా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ గ్లాస్‌గోలో చేసిన సాహసాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె చేసిన పని చాలా గొప్పదని, దేశమంతా దానిని సుదీర్ఘకాలం గుర్తుపెట్టుకుంటుందని కొనియాడారు.

PM Modi Athletes Meet | అసలేం జరిగిందంటే?

గ్లాస్‌గోలోని ఓ రెస్టారెంట్‌కు లవ్లీనాతో పాటు మరికొందరు భారత అథ్లెట్లు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ టవల్స్ (నాప్‌కిన్స్)పై భారత మ్యాప్ అసంపూర్తిగా ముద్రించి ఉండటాన్ని లవ్లీనా గమనించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలను సరిగ్గా చూపించకపోవడంతో ఆమె వెంటనే దానిపై అభ్యంతరం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో, సదరు రెస్టారెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టి క్షమాపణలు తెలిపింది. అయితే ఇది కేవలం పొరపాటు కాదని, కావాలనే చేశారంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. విజయోత్సవాల సమయంలోనూ దేశ పటంపట్ల లవ్లీనా చూపిన బాధ్యత, అప్రమత్తత ఎంతో అభినందనీయమని ప్రధాని మోదీ ప్రశంసించారు.

PM Modi Athletes Meet | పాక్ బాక్సర్‌తో అనుభవం..

ఇదే సమావేశంలో మరో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ గతంలో తనకు పాకిస్థాన్ బాక్సర్‌తో ఎదురైన సరదా అనుభవాన్ని ప్రధానితో పంచుకున్నారు. 2015 మిలిటరీ గేమ్స్‌లో తనకు పాక్ బాక్సర్‌తో మ్యాచ్ జరిగిందని, ఆ మ్యాచ్‌లో తాను విజయం సాధించానని తెలిపారు. ఆ తర్వాత సదరు పాక్ బాక్సర్ తనతో మాట్లాడుతూ.. ‘‘నీ పేరు నరేందర్, మీ కోచ్ పేరు నరేందర్, మీ ప్రధాని పేరు నరేంద్ర.. ఇకపై నాకు ఈ ‘నరేంద్ర’ అనే పేరంటేనే నచ్చదు ’’ అని సరదాగా అన్నాడని చెప్పాడు. ఈ ఘటనను విన్న ప్రధాని మోదీ గట్టిగా నవ్వుతూ ఆనందించారు.

 

ఇది కూడా చదవండి: Future City Land Allegations | ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూ దోపిడీ : మన్నె క్రిశాంక్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *