అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab Drug Scandal | శివసేన నాయకుడిని డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ఓ ఏఎస్సై కుట్ర పన్నాడు. అతడి ఇంట్లోకి వెళ్లి హెరాయిన్ పెట్టాడు. అనంతరం పోలీసులు తనిఖీ చేయగా.. డ్రగ్స్ దొరకడంతో ఆ నాయకుడిని అరెస్ట్ చేశారు. అయితే బాధితుడి ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఏఎస్సై బాగోతం బయట పడింది.
పంజాబ్ (Punjab)లోని ఖన్నాలో శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో డ్రగ్స్ పెడుతూ ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ అడ్డంగా దొరికిపోయాడు. పోలీసు బృందం రాకముందే సుఖ్‌దేవ్ సింగ్ సాదా దుస్తులలో ఇంట్లోని ఒక గదిలోకి ప్రవేశించాడు. అతను పరుపు కింద ఒక వస్తువును ఉంచి, ఆ తర్వాత గది నుండి బయటకు వెళ్లాడు. కొంత సమయం తర్వాత పోలీసులు వచ్చి ఇంట్లో తనిఖీలు చేశారు. వారికి బెడ్ కింద 30 గ్రాముల హెరాయిన్ దొరికింది. దీంతో గిరిని డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారు.
Punjab Drug Scandal | సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో..
మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో ఏఎస్సై డ్రగ్స్ పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఏఎస్సై సుఖ్‌దేవ్ సింగ్‌ను ఎస్ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా సస్పెండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించామన్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి, ఇందులో ప్రమేయం ఉన్న పోలీసు సిబ్బంది అందరి పాత్రను నిర్ధారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Jeevan Pramaan Certificate | పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30 లోపు ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి..లేదంటే పింఛన్ కట్!