Rahul Gandhi UGC NET | యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. మోదీ సర్కార్‌పై విమర్శలు

యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్షల్లో భాగంగా సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టుల పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi UGC NET | యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్షల్లో భాగంగా సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టుల పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ మూడు పరీక్షల్లో ఎన్‌టీఏ లోపభూయిష్టమైన ప్రశ్నపత్రాలు తయారు చేయడం, పాత ప్రశ్నలనే పునరావృతం చేయడం వల్లనే ఇప్పుడు వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.

ఏళ్ల తరబడి కష్టపడి చదివి, ఫీజులు చెల్లించి, దూర ప్రాంతాలకు ప్రయాణించి పరీక్షలు రాసిన వేలాది మంది విద్యార్థులు సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఎన్‌టీఏ తప్పులకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Rahul Gandhi UGC NET | విద్యా వ్యవస్థ ‘దోపిడీ యంత్రం’గా మారింది..

ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బదులు వారి డబ్బు, సమయం, మానసిక ఆరోగ్యం , ఆత్మవిశ్వాసాన్ని హరించివేసే ఒక ‘దోపిడీ యంత్రం’ (Extraction machine)గా మారిపోయిందని రాహుల్ మండిపడ్డారు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ అయ్యాయా లేదా అన్న అసలు ప్రశ్నకు ఎన్‌టీఏ ఇప్పటికీ సమాధానం దాటవేస్తోందని, మోదీ ప్రభుత్వంలోని మిగతా విభాగాల మాదిరిగానే ఎన్‌టీఏ కూడా తన తప్పును ఎప్పటికీ ఒప్పుకోదని విమర్శించారు.

కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపోదని, ఎన్‌టీఏ నాయకత్వాన్ని కూడా పూర్తిగా జవాబుదారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులదేమీ తప్పు కాదని, ఒక పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని వ్యవస్థను నిర్మించిన ప్రధాని మోదీ దీనికి సమాధానం చెప్పేంతవరకు తాము పోరాటం ఆపేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Cauvery Water Dispute | కావేరీ జలాల వివాదం.. తమిళనాడుకు సుప్రీంకోర్టు కీలక సూచన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *