అక్షరటుడే వెబ్‌డెస్క్ : Railway Travel Insurance | భారతీయ రైల్వే ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూర్చేలా సుప్రీంకోర్టు ( Supreme Court ) సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటివరకు కేవలం ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని, ఇకపై రైల్వే కౌంటర్ల వద్ద ఆఫ్‌లైన్ టికెట్లు కొనుగోలు చేసే వారికి కూడా వర్తింపజేయాలని భారతీయ రైల్వేను ఆదేశించింది. అక్టోబర్ 27 నుంచే ఈ నూతన విధానాన్ని అమలులోకి తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడు కేవలం 45 పైసలు అదనంగా చెల్లిస్తే రూ. 10 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. అయితే ఈ సదుపాయం ప్రయాణికుడి ఐచ్ఛికం (ఆప్షనల్) మాత్రమే, తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
Railway Travel Insurance | సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు..
‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాధా యాదవ్’ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక ఆదేశాలను వెలువరించింది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా రైలు ప్రయాణికులందరికీ సమానంగా భద్రత , రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
Railway Travel Insurance | పరిహారం వివరాలు..
ఈ ఇన్సూరెన్స్ విధానం కింద ప్రయాణ సమయంలో రైలు ప్రమాదం లేదా ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగి నష్టం వాటిల్లితే గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు బీమా అందుతుంది. ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత సంపూర్ణ అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షలు చెల్లిస్తారు. అదేవిధంగా పాక్షిక అంగవైకల్యం బారిన పడితే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షలు, మృతదేహ రవాణా ఖర్చుల కోసం రూ. 10 వేలు పరిహారంగా అందజేస్తారు.
Railway Travel Insurance | ఇన్సూరెన్స్ పొందే విధానం..
రైల్వే కౌంటర్ వద్ద ఆఫ్‌లైన్ టికెట్ తీసుకునేటప్పుడు ఈ బీమా సదుపాయం పొందాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా తమ మొబైల్ నంబరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 45 పైసల ప్రీమియాన్ని డిజిటల్ పేమెంట్ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని టికెట్ చార్జీతో కలిపి వసూలు చేస్తారు. బుకింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నమోదు చేసుకున్న ఫోన్ నంబరుకు ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సంపూర్ణ వివరాలు సందేశం రూపంలో అందుతాయి.
ఇది కూడా చదవండి: Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్