Ration Rice Recycling | రేషన్ బియ్యం.. మిలర్లకు వరం.. యథేచ్ఛగా రీసైక్లింగ్​ దందా

నిజామాబాద్​ జిల్లాలో రేషన్​ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు మిల్లర్లు దళారుల ద్వారా బియ్యం సేకరించి రీసైక్లింగ్​ చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, డిచ్​పల్లి: Ration Rice Recycling | పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం దళారుల ద్వారా రైస్ మిల్లులకు చేరుతోంది. మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం దళారులకు వరమైంది.

కిలోకు రూ.18కే కొనుగోలు చేస్తూ, అదే బియ్యాన్ని రీ-సైక్లింగ్ ద్వారా ప్రభుత్వానికే సీఎంఆర్ కింద అప్పగించేందుకు మిల్లర్లు యత్నిస్తున్నారు. నిఘా వర్గాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కళ్లు గప్పి కోట్ల రూపాయల అక్రమ దందా కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో దళారులు రేషన్​ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించే ప్రక్రియను జోరుగా సాగిస్తునారు. బైక్​లు, ఆటోలతో పల్లెల్లోకి వెళ్లి లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలా గ్రామాల్లో సేకరించిన బియ్యం మళ్లీ వ్యాపారుల చేతులు మారి రైస్‌మిల్లర్లకు చేరుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అధిక ధరలకు విక్రయించడం, సీఎంఆర్​గా చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Ration Rice Recycling | తనిఖీల వేళ..

పౌరసరఫరాల అధికారులు ఇటీవల మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లులపై చర్యలకు సిద్ధం అవుతున్నారు. సకాలంలో సీఎంఆర్​ బియ్యం అందించాలని ఆదేశిస్తున్నారు. దీంతో రైస్​ మిల్లర్లు రేషన్​ బియ్యం కొనుగోలు చేసి రీ సైక్లింగ్ ​చేస్తున్నారు. తనిఖీలకు వచ్చే సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటున్న సిండికేట్ మిల్లుల్లోని నిల్వలను రాత్రికి రాత్రే సర్దుబాటు చేస్తోంది. పీడీఎస్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి, సాధారణ నోటిఫైడ్ బియ్యంతో కలిపి ప్యాక్ చేయడంతో అధికారులు సైతం ఇది పీడీఎస్ బియ్యమా లేక సీఎంఆర్ బియ్యమా అనేది గుర్తించలేకపోతున్నారు.

Ration Rice Recycling | మచ్చుకు కొన్ని ఉదంతాలు

ఏప్రిల్ నెలలో డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని గణేష్‌ రైస్‌ మిల్లులో అధికారులు 304 క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు కాంట్రాక్టర్లు, వాహన డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సిరికొండ మండలం కొండాపూర్ శ్రీ బాలాజీ రైస్ మిల్ యజమాని బెజగం భాస్కర్ ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేసి 284 క్వింటాళ్ల బియ్యాన్ని లారీలో లోడ్ చేస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు. భాస్కర్‌పై కేసు నమోదు చేసి బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు.

Ration Rice Recycling | సరిహద్దులు దాటిస్తూ..

నిజామాబాద్‌ జిల్లాలో (Nizamabad District) 205 రా రైస్, 59 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. జిల్లాకు మహారాష్ట్ర పక్కన ఉండడంతో అక్రమంగా సేకరించిన బియ్యం సరిహద్దులు దాటి తరలిస్తున్నట్లు సమాచారం. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేయడం సరిపోదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామస్థాయిలో బియ్యం కొనుగోలు చేస్తున్న దళారుల నుంచి రైస్‌మిల్లుల వరకు మొత్తం గొలుసు కట్టు వ్యవహారం గుర్తించాలి. పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలు సమన్వయంతో పని చేస్తే ఈ దందాను అరికట్టవచ్చు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *