అక్షరటుడే వెబ్‌డెస్క్: Russia Ukraine Peace | ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపునకు తీసుకువచ్చే శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ ( India ), చైనాలు ముందుకు రావడంపై రష్యా సానుకూలంగా స్పందించింది. ఈ రెండు దేశాల చొరవను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తిగా స్వాగతించినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. బ్రిక్స్ సదస్సు వేదికగా వెలువడిన ఈ ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Russia Ukraine Peace | ట్రంప్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించారు. ఆ దిశగా ఆయన తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లను రష్యా, ఉక్రెయిన్‌లకు పంపి దౌత్యపరమైన మంతనాలు జరిపారు. స్వయంగా పుతిన్‌తోనూ సంప్రదింపులు జరిపినప్పటికీ శాంతి ఒప్పందం కుదరడంలో ఆయన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ తరుణంలో భారత్, చైనాల జోక్యానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ట్రంప్ యంత్రాంగానికి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Russia Ukraine Peace | జెలెన్స్కీ సానుకూల సంకేతాలు..
మరోవైపు, యుద్ధం మొదలైన నాటి నుంచి నేటి వరకు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ముఖాముఖిగా ఎప్పుడూ చర్చలు జరపలేదు. అయితే త్వరలో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరైతే, తాను కూడా అక్కడకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమని జెలెన్స్కీ ఇటీవల సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇలాంటి కీలక తరుణంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తరఫున వస్తున్న శాంతి ప్రయత్నాలు అంతర్జాతీయంగా నూతన ఆశలను రేకెత్తిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Konda Surekha Warning | ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కొండా సురేఖ వార్నింగ్