అక్షరటుడే, వెబ్డెస్క్: SDRF Personnel Rescue | ఖమ్మం జిల్లా (Khammam District) సత్తుపల్లి మండలం బెతుపల్లి చెరువులో పడవ బోల్తా పడటంతో గల్లంతయిన 11 సిబ్బందిలో 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఒక వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు.
మురాస్ తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో బెతుపల్లి చెరువుకు భారీగా వరద వచ్చింది. ఆ చెరువులో పలువురు మత్స్యకారులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం రాత్రి వారిని రక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పలువురిని ఒడ్డుకు చేర్చారు. మిగతా వారి కోసం 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో బయలు దేరారు. అయితే ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్లు బోల్తా పడ్డాయి. దీంతో 11 మంది సిబ్బంది గల్లంతయ్యారు.
SDRF Personnel Rescue | తెల్లవారుజాము వరకు..
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గల్లంతయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో ఐదుగురు ఒక చోట ఉన్నట్లు గుర్తించారు. చిక్కుకున్న వారితో అధికారులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరపగలిగారు. అనంతరం గురువారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాత్రంతా ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు. చివరి వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Murassu Cyclone | తగ్గిన మురాస్ తుపాన్ ప్రభావం