అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Seethamma Sagar | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థ సాధక బ్యారేజీ, జలవిద్యుత్‌కు సంబంధించిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Seethamma Sagar | రైతులకు అంకితం చేయాలి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా రైతాంగం ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ప్రాజెక్టు సీతమ్మసాగర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి పర్యావరణ అనుమతులు కూడా లభించాయని తెలిపారు. గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : POCSO Case Nizamabad | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష