Shadow Councillors Kamareddy | షాడో కౌన్సిలర్లు.. వార్డుల్లో పెత్తనమంతా వారిదే!

మున్సిపల్​ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన మహిళా కౌన్సిలర్లు.. అనంతరం వంటింటికే పరిమితమయ్యారు. దీంతో వారి భర్తలు, కుమారులు వార్డుల్లో చక్రం తిప్పుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి:  Shadow Councillors Kamareddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Kamareddy Municipality) దాదాపు మహిళా ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో గెలుపొందారు. మహిళా రిజర్వేషన్​తో పాటు (Women Reservation) జనరల్ స్థానాల్లో మహిళలు పోటీ చేసి పురుషులతో సమానంగా పోటీకి దిగి విజయ బావుటా ఎగురవేశారు. ఎన్నికల్లో ప్రతివార్డులో నేనున్నా మీకు అని ఓటర్లకు భరోసా ఇచ్చిన సదరు మహిళా ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత మాత్రం ప్రజల కళ్లకు కనిపించకుండా పోయారు. వారి స్థానంలో నేనే కౌన్సిలర్ అంటూ వారి భర్తలు, కొడుకులు దర్జాగా తిరుగుతూ పనులు చక్కబెడుతున్నారు.

Shadow Councillors Kamareddy | 23 మంది మహిళా కౌన్సిలర్లు

స్థానిక సంస్థల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. కాగితాలపై కౌన్సిలర్ పేరు ఒకరైతే, నిజంగా నిర్ణయాలు తీసుకునేది ఇంకొకరు అనే షాడో కౌన్సిలర్ వ్యవస్థ ఇక్కడ బలంగా వేళ్లూనుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఇందులో 23 మంది మహిళలే కౌన్సిలర్లుగా ఉన్నారు. అయితే స్థానిక సమస్యలపై మహిళా కౌన్సిలర్లకు అవగాహన శూన్యమని ప్రచారంలో ఉంది. సమావేశాలకు వెళ్ళినప్పుడు భర్తలు, తండ్రులు, తోబుట్టువులకు ఫోన్ చేసి ఏ విషయంపై అడగాలని సలహా తీసుకోవడం పరిపాటిగా మారుతోంది.

Shadow Councillors Kamareddy | సంతకాల కోసమే సమావేశాలకు..

మున్సిపల్ సాధారణ సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు వెళ్లాల్సిన చాలా మంది మహిళా కౌన్సిలర్లు కేవలం సంతకాలు పెట్టి ‘హాజరయ్యాం’ అని చెప్పుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు. మిగతా సమయాల్లో వారి స్థానంలో భర్తలు, అన్నదమ్ములు, కొడుకులు, తండ్రులు హాజరై అధికారులను ప్రశ్నలు అడుగుతున్నారు. ఫైళ్లపై సంతకం పెట్టడానికి మాత్రమే అసలు కౌన్సిలర్ వస్తున్నారు. ‘మేడం’ పేరుతో గెలిచారు కానీ మాట్లాడేది, డెవలప్​మెంట్​ పనులు అడిగేది అంతా సారే అని వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ తగ్గి, వ్యక్తిగత ప్రయోజనాల చర్చకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Shadow Councillors Kamareddy | పేరుకే రిజర్వేషన్.. అధికారం ఎక్కడ?

49 వార్డుల్లో దాదాపు సగం వరకు స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఆ సీట్లలో గెలిచిన మహిళల్లో చాలా మందికి మున్సిపల్ చట్టాలు, బడ్జెట్ ప్రక్రియ, నిధుల వినియోగంపై కనీస అవగాహన లేదు. ఫలితంగా తమ వార్డులో రోడ్లు, డ్రైనేజీ, నల్లా నీళ్ల సమస్యలపై కూడా అధికారులను నిలదీయలేకపోతున్నారు. ఇదే అదునుగా కుటుంబ సభ్యులు షాడోలుగా వ్యవహరిస్తూ కాంట్రాక్టులు, పనుల కేటాయింపుల్లో జోక్యం చేసుకుంటున్నారు.

Shadow Councillors Kamareddy | వంటింటికే పరిమితమవుతున్న మహిళలు

ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి హామీలు ఇచ్చిన చాలా మంది మహిళా ప్రతినిధులు గెలిచిన తర్వాత మళ్లీ వంటింటికే పరిమితమయ్యారు. క్షేత్ర స్థాయి పర్యటనలు, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వార్డు సమస్యలపై ఫాలోఅప్ లాంటివి దాదాపుగా ఉండటం లేదు. గెలిచిన కౌన్సిలర్ ఫోన్ నంబర్ కేవలం మున్సిపల్ కార్యాలయంలో మాత్రమే ఉంటుంది. అక్కడ కూడా సగానికి పైగా కుటుంబ సభ్యుల పేర్లే ఉంటున్నాయి. దాంతో మహిళా కౌన్సిలర్లు ప్రజలకు నేరుగా అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారుతున్నాయి.

అవగాహనాలోపంతో ప్రజలకు నష్టం

కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నా వాటికి హాజరయ్యేది చాలా తక్కువ మంది మాత్రమే. జీవోలు, పథకాల అర్హతలు, నిధుల వినియోగ విధానం తెలియకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు సైతం సక్రమంగా వినియోగం కావడం లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం, రిజర్వేషన్ ఇవ్వడమే కాదు, ఎన్నికైన ప్రతినిధులకు నెలకొకసారి అవగాహన కార్యశాలలు, చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతో షాడో పాలన కొనసాగుతూనే ఉంటుందనే చర్చ సాగుతోంది.

చర్యలు తీసుకుంటారా..?

స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే రిజర్వేషన్ కాగితాలకే పరిమితం అవుతున్న విషయం అధికారులకు తెలిసినా, మహిళ కౌన్సిలర్ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయంలో తిష్ట వేసి అధికారులపై ఒత్తిడి చేస్తున్నా ఎన్నికైన కౌన్సిలర్​కు మాత్రమే మేము సమాధానం చెప్తాం అని ఖరాఖండిగా చెప్పలేకపోతున్నారు. ఫలితంగా షాడోల పెత్తనానికి అధికారులే కారణం అవుతుండటం గమనార్హం. ఇది ఒక్క కామారెడ్డికి మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇకనైనా చట్టబద్ధమైన మహిళా రిజర్వేషన్ పక్కాగా అమలు చేయడంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా.. ? లేక రిజర్వేషన్ అమలైతే మాకేంటి.. కాకపోతే మాకేంటి అని వదిలేస్తారా వేచి చూడాలి.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *