అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: School Bandh | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ (ABVP) కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
School Bandh | 23న రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం (23న) పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో(Telangana) పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని అందుకే రేషనలైసేషన్(School Rationalisation) పేరుతో 23వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ పరిచారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
School Bandh | పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో..
ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25శాతం సీట్లను అందించే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం అటుకెక్కిచ్చిందన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పర్యవేక్షణ లేకుండా నడుస్తున్నాయని.. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో(DEO) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఒక పర్మిషన్‌పై పలు బ్రాంచ్‌లను నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్కాభవనాలు నిర్మించాలని, ఫుడ్ పాయిజన్‌కు తావులేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీంను(Breakfast Scheme) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని అక్షయ్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ‘తమ భూమి గురించి SBI కోర్టుకు వెళ్తే..