అక్షరటుడే, వెబ్డెస్క్ : Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సింగీతం శ్రీనివాసరావు తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రాలు తెరకెక్కించారు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, మయూరి వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన 94 వయసులో చనిపోయారు. సింగీతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా తెరకెక్కించిన సింగ్ గీతం మూవీ ఇటీవల విడుదలైంది.
Singeetham Srinivasa Rao | అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి..
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్లోని గూడూరులో జన్మించారు. ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అనంతరం 1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో ఆయన పేరుగాంచారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన ఆదిత్య 369 మూవీ ఏకంగా 28 సెంటర్లలో వంద రోజులు ఆడింది.
Singeetham Srinivasa Rao | నివాళులు అర్పించిన హీరోలు
సింగీతం మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాలం కంటే ముందున్న ఆలోచనలు కలిగిన దర్శకుడు సింగీతం అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. భారతీయ సినిమా దిగ్గజం ఇక లేరని, భారత సినిమా ఆయనకు రుణపడి ఉంటుందని మహేశ్ బాబు పేర్కొన్నారు. సింగీతం మృతికి విజయ్ దేవరకొండ సంతాపం తెలిపారు. ఆయన ఆలోచనలు, కథలు ఎప్పటికీ తమతోనే ఉంటాయన్నారు.
Singeetham Srinivasa Rao | సేవలు చిరస్మరణీయం
సింగీతం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దీనిని కూడా చదవండి : Air Ambulance Missing | ఎయిర్ అంబులెన్స్ అదృశ్యం.. ఆరుగురి ఆచూకీ గల్లంతు