Streenidhi | స్త్రీనిధితో మహిళల ఆర్థిక స్వావలంబన : మంత్రి సీతక్క

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Streenidhi | ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిదన్నారు. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రారంభించిన స్త్రీనిధి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు.

Streenidhi | రూ. 24 వేల కోట్ల రుణాలు

ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్త్రీనిధి అస‌లు సిస‌లు మాహిళా బ్యాంక్ అని కొనియాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యమన్నారు. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కొంతమంది సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో సంస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

Streenidhi | ఒక్కరిని కూడా తొలగించం

తమది ఉద్యోగ అనుకూల ప్రభుత్వమని సీతక్క తెలిపారు. స్త్రీనిధిలో ఒక్క‌రిని కూడా తొల‌గించ‌లేదని చెప్పారు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. స్త్రీనిధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. స్త్రీనిధి సంస్థ ఏర్పాటులో, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎండీ విద్యాసాగర్ రెడ్డిని మంత్రి అభినందించారు.

ఇది కూడా చదవండి..: Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *