అక్షరటుడే వెబ్‌డెస్క్: Subsidized Onion Price | ఉల్లిపాయల ధరలు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయలను రూ.35 కే సబ్సిడీపై అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ఈ విక్రయాలు ప్రారంభమయ్యాయి.
విజయవాడ ( Vijayawada )ఏపీఐఐసీ రైతు బజారులో మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించి, వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు, డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ధరల స్థిరీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని.. బహిరంగ మార్కెట్లో రూ.75 వరకు ఉన్న ఉల్లిని కేవలం రూ.35 కే అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Subsidized Onion Price | మినీ లారీల ద్వారా విక్రయాలు..
వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు ధరల పెరుగుదల కోసం ఉల్లిని నిల్వ చేయడం కూడా రేట్లు పెరగడానికి కారణమని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో మినీ లారీల ద్వారా నేరుగా సామాన్యులకు ఉల్లిపాయలను అందిస్తామని వెల్లడించారు. అలాగే కందిపప్పు, పామాయిల్ ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పును ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా మరో వెయ్యి మినీ మార్టులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
Subsidized Onion Price | బియ్యం కొరత లేదు..
ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రంలో బియ్యం కొరత ఉందనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు. రాబోయే మూడేళ్ల వరకు ఏపీలో ఎలాంటి బియ్యం కొరత ఉండదని స్పష్టం చేశారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరికీ బీపీటీ స్టీమ్డ్ రైస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, సరఫరాను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. మధ్యవర్తులు లేకుండా రైతు బజార్ల ద్వారా నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Oppo K14 Plus | ఆండ్రాయిడ్ 17 ఓఎస్‌తో ఒప్పో ఫోన్ లాంచ్.. అక్టోబర్ 8న సేల్ ప్రారంభం