Telangana Caste Census | అవసరమైతే లెక్కలు సరిచేస్తాం.. కులగణనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు!

బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Caste Census | బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తమ ప్రభుత్వం చేసి చూపించిందని, ఏడాది వ్యవధిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను వెలికితీశామని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana Caste Census | కేబినెట్‌లో సవరిస్తాం..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల్లో తమ వివరాలు నమోదు కాలేదని ఎవరైనా భావిస్తే, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. ఏదైనా కులానికి సంబంధించి లెక్కలు తక్కువగా నమోదయ్యాయని భావిస్తే, సరైన వివరాలను అందించాలని సూచించారు. రాబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, జాబితా నుంచి విడిపోయిన వారిని చేర్చి లెక్కలను మరింత పక్కాగా రూపొందిస్తామని తెలిపారు. తన శక్తిమేర తన కుర్చీ చుట్టూ బలహీన వర్గాలను కూర్చోబెట్టుకోవడమే తన ఆలోచన అని పేర్కొన్నారు.

Telangana Caste Census | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి ..

ముదిరాజ్‌లను ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుండి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలనే సుదీర్ఘ డిమాండ్‌పై ముఖ్యమంత్రి స్పందించారు. ఈ విషయంపై ముదిరాజ్ సంఘం నాయకులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, చట్టపరమైన అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదే సమయంలో గంగపుత్రులలో ఉన్న అపోహలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ సామాజికవర్గ నేతలకు ఎన్నో రాజకీయ అవకాశాలు కల్పించామని, మిగిలిన నాయకులకు కూడా త్వరలోనే తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Telangana Caste Census | కేసీఆర్‌పై పరోక్ష వ్యాఖ్యలు..

తన పనితీరుపై మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనకు ఇంకా వయస్సు, తగినంత ఓపిక ఉన్నాయని, తానేమీ ఫామ్‌హౌస్‌లో పడుకునే రకాన్ని కాదని వ్యాఖ్యానించారు. ప్రజా సేవే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన మంచి సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా కొనసాగిస్తూనే, తమ ప్రభుత్వం కొత్తగా మరిన్ని ప్రజానుకూల పథకాలను తెచ్చిందని వివరించారు.

Telangana Caste Census | ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహాలు..

ప్రజా యోధుడు పండుగ సాయన్న జయంతి , వర్ధంతి వేడుకలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పండుగ సాయన్న కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ప్రజా పోరాటాల ప్రతీకలైన దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల విగ్రహాలను హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ట్యాంక్‌బండ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి..: Panduga Sayanna | ముదిరాజ్​లను ‘బీసీ–ఏ’లోకి మారుస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *